
యూరియా అక్రమ రవాణాను అడ్డుకున్న రైతులు
తిరువూరు: గంపలగూడెం మండలం ఊటుకూరులో బుధవారం ప్రైవేటు డీలర్ వద్ద నుంచి అక్రమంగా యూరియా తరలిస్తుండగా రైతులు అడ్డుకున్నారు. మినీ వ్యానులో యూరియా బస్తాలను వేరే ప్రాంతానికి తరలిస్తున్నట్లు గమనించి వ్యాను నిలిపివేయించారు. ఒక్కొక్క రైతుకు ఒక బస్తా యూరియా ఇస్తున్న వ్యవసాయశాఖ ఇప్పుడు కొందరు రైతుల పేరుతో ఐదు బస్తాలు చొప్పున ఇచ్చినట్లు వారు ఆరోపించారు. ఊటుకూరు ప్రాంతంలో రైతులు ఖరీఫ్ వరిపైర్లకు యూరియా సరఫరా లేక ఇబ్బంది పడుతుంటే దొడ్డిదారిని ఇతర గ్రామాలకు తరలించడంపై వైఎస్సార్ సీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి ఆలపాటి ఉమామహేశ్వరరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసుల సమక్షంలోనే అక్రమంగా యూరియా తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రెండు నెలలుగా యూరియా కోసం పగలూ రాత్రీ సొసైటీల వద్ద రైతులు పడిగాపులు పడుతుంటే ఒక కట్టకు మించి ఇవ్వని అధికారులు కొందరు ప్రముఖులకు ఎక్కువ మొత్తంలో యూరియా అందించడం శోచనీయమని ఆయన పేర్కొన్నారు.

యూరియా అక్రమ రవాణాను అడ్డుకున్న రైతులు