
మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళన
ఉయ్యూరు: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉయ్యూరు ప్రధాన సెంటరులో కుటుంబ సభ్యులు, సహచరులు మంగళవారం రాస్తారోకో చేశారు. విజయవాడ–మచిలీపట్నం జాతీయరహదారిపై గండిగుంట వద్ద సోమవారం రాత్రి కారు ఢీకొని విన్నకోట శ్రీరాములు (55) మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి కారును సీజ్ చేశారు. మృతుని కుటుంబానికి ఆర్థికపరంగా న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులు, కార్మికులు ఉయ్యూరు సెంటరులో ఆందోళనకు దిగారు. రూ. 15 లక్షలు పరిహారం కారు యజమాని నుంచి ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనతో సెంటరులో ట్రాఫిక్ స్తంభించింది. సీఐ టీవీవీ రామారావు, రూరల్ ఎస్‌ఐ సురేష్‌బాబు ఆందోళనకారులతో సంప్రదింపులు జరిపారు. చట్టప్రకారం కేసు నమోదుచేసి కారును సీజ్ చేశామన్నారు. మృతునికి న్యాయం జరిగేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఆందోళనకారులపై ప్రజలకు అసౌకర్యం కలిగించినందుకు గానూ కేసు నమోదు చేసినట్లు సమాచారం.