
జిల్లా ప్రజలకు మెరుగైన సేవలందించాలి
ఆసిఫాబాద్‌రూరల్: విద్యార్థులు వైద్యులుగా ఎదిగి జిల్లా ప్రజలకు మెరుగైన సేవలందించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. కాగజ్‌నగర్ పట్టణంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో ఐదో తరగతి నుంచి ఇంటర్ వరకు చదివి ఎంబీబీఎస్ సీట్లు సాధించిన సయ్యద్ అంజద్ అలీ, సయ్యద్ అబుజార్, సయ్యద్ ఇక్రాముద్దీన్‌ను సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో అభినందించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్య అందుతుందని తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివితే ప్రయోజకులు కావచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి అబ్దుల్ నదీమ్, సమన్వయకర్త రిజ్వాన్ తదితరులు పాల్గొన్నారు.