
దివ్యాంగుల భవితకు భరోసా
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లాలో ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో అధికా రులు చర్యలు చేపడుతున్నారు. సామాజిక న్యా యం, సాధికారతే లక్ష్యంగా 18 ఏళ్లలోపు దివ్యాంగులకు అండగా నిలుస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని భవిత కేంద్రాల ద్వారా ఉచిత విద్య, వైద్యం అందిస్తున్నారు. అలాగే కృత్రిమ అవయవాల తయారీ సంస్థ అలిమ్‌కో ద్వారా జిల్లాలోని దివ్యాంగ చిన్నారులకు అవసరమైన సహాయ ఉపకరణాలు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.
ఆత్మవిశ్వాసం నింపుతున్న ‘భవిత’
ఒకరి సహాయం లేకుండా అడుగు ముందుకు వేయలేని, రోజువారీ అవసరాలు కూడా తీర్చుకోలేని స్థితిలో ఉన్న శారీరక, మానసిక వైకల్యంతో బాధపడుతున్న చిన్నారులకు భవిత కేంద్రాలు అండగా నిలుస్తున్నాయి. వైకల్యంతో పుట్టిన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్ది, వారిలో ఆత్మవిశ్వాసం నింపడమే లక్ష్యంగా ఇవి పనిచేస్తున్నాయి. ప్రభుత్వం ప్రతీ మండల కేంద్రంలో ఒక భవిత కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం జిల్లాలోని 15 మండలాల్లో ఈ కేంద్రాలు సేవలందిస్తున్నాయి. ప్రతీ కేంద్రంలో ఇద్దరు ప్రత్యేక ఉపాధ్యాయులు, ఒక స్పీచ్/ఫిజియో థెరపిస్ట్, ఒక ఆయాను నియమించారు. జిల్లాలో 1805 మంది ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఈ కేంద్రాల ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. వీరిలో 1616 మంది సాధారణ పాఠశాలల్లో విలీన విద్యనభ్యసిస్తుండగా, 136 మంది ఐఈఆర్‌సీ కేంద్రాల్లో, మరో 53 మంది గృహ ఆధారిత విద్య ద్వారా చదువుకుంటున్నారు. అయితే మొత్తం 56 మంది ఉపాధ్యాయులు అవసరం కాగా, ప్రస్తుతం 33 మందే పనిచేస్తున్నారు. మరో 23 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇంటి వద్దే ఉండి చదువుకుంటున్న పిల్లలకు ప్రతీ శనివారం సిబ్బంది వారి ఇళ్లకే వెళ్లి ఫిజియోథెరపి అందిస్తున్నారు.
184 మందికి సహాయ ఉపకరణాలు
జిల్లాలో 18 ఏళ్లలోపు 1805 మంది ప్రత్యేక అవస రాల పిల్లల్లో సహాయ ఉపకరణాలు అత్యవసరమై న 184 మందిని అధికారులు గుర్తించారు. ఆగస్టు 28, 29 తేదీల్లో ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ కేంద్రాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించి అర్హులను ఎంపిక చేశారు. 184 మంది చిన్నారుల కోసం అలిమ్‌కో సంస్థ రూ.20,99,113 విలువైన ఫోల్డబుల్ వాకర్స్, ఫోల్డింగ్ వీల్‌చైర్లు, కమోడ్‌తో కూడిన వీల్‌చైర్లు, రోలాటర్లు, టీఎల్‌ఎం కిట్లు, ట్రైసైకిళ్లు వంటి ఉపకరణాలను అందించనుంది. వీటి పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే దివ్యాంగ ధ్రువీకరణ పత్రాలు లేనివారికి ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి కార్డులు జారీ చేస్తామని అదనపు కలెక్టర్, డీఈవో దీపక్ తివారి ఇటీవలే ప్రకటించారు.
త్వరలోనే అందిస్తాం
ఈ విద్యా సంవత్సరంలో జిల్లాలో గుర్తించిన ప్రత్యేక అవసరాలు గల పిల్లలు 184 మందికి త్వరలోనే సహాయ ఉపకరణాలను అందిస్తాం. ప్రత్యేక అవసరాల పిల్లలపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. భవిత కేంద్రాల ద్వారా అవసరమైన శిక్షణ, ఫిజియోథెరపి అందిస్తున్నాం. పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్యను అందించడానికి కట్టుబడి ఉన్నాం.
– కటుకం మధుకర్, జిల్లా విలీన విద్య కోఆర్డినేటర్