
కాటేస్తున్న కరెంటు!
వర్షాకాలంలో పొంచి ఉన్న ముప్పు విద్యుత్ తీగలతో ప్రమాదాలు మనుషులతోపాటు జంతువులు మృత్యువాత జాగ్రత్తలు పాటించాలని అధికారుల సూచన
ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు గొమాసి పోశయ్య. దహెగాం మండలం పీకలగుండం గ్రామానికి చెందిన ఇతను గత నెల 18న పంట చేనులో మోటార్ ఆన్ చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇలా జిల్లాలో విద్యుత్ ప్రమాదాల్లో ఏటా జంతువులు, మనుషులు మృత్యువాత పడుతున్నారు.
పెంచికల్‌పేట్(సిర్పూర్): జిల్లాలో విద్యుత్ ప్రమాదాల కలవరపెడుతున్నాయి. కరెంట్ తీగలు యమపాశాలుగా మారి ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. నివాస గృహాలతోపాటు పంట పొలాల వద్ద జరుగుతున్న ప్రమాదాల్లో ప్రజలు తీవ్రంగా గాయపడుతున్నారు. ప్రమాదాల నివారణకు విద్యుత్‌శాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తున్నా క్షేత్రస్థాయిలో ఫలితం ఉండటం లేదు. దీంతో జిల్లాలో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
గతేడాది ఎనిమిది మంది మృత్యువాత
జిల్లాలోని 15 మండలాల పరిధిలో 335 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ డివిజన్లు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలు, మున్సిపాలిటీల పరిధిలో గతేడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు అనేక విద్యుత్ ప్రమాదాలు జరగాయి. ఎనిమిది మంది మృత్యువాత పడగా, 18 జంతువులు మృతి చెందాయి. అలాగే ఈ ఏడాదిలో ఇప్పటివరకు విద్యుత్ ప్రమాదాల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, 19 జంతువులు చనిపోయాయి. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో నిర్లక్ష్యంతోనే విద్యుత్ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. రైతులు సొంతంగా ఎలాంటి పనులు చేయొద్దని, సమస్యలు ఉంటే వెంటనే విద్యుత్ శాఖ సిబ్బందికి సమాచారం అందించాలని కోరుతున్నారు.
జాగ్రత్తలు అవసరం
వర్షాకాలం నేపథ్యంలో విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. విద్యుత్ పరికరాలను తడిచేతులతో తాకొద్దు. తెగిపోయిన వైర్లను ఎట్టిపరిస్థితుల్లోనూ ముట్టుకోవద్దు. గ్రామ్లాలోని విద్యుత్ లైన్ల కింద ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దు. ఇంట్లోని పాత విద్యుత్ తీగలు, లైట్లు, స్విచ్‌లను ఎప్పటికప్పుడు పరిశీలించి అవసమైతే కొత్తవి బిగించాలి. ఇనుప చువ్వల దగ్గర విద్యుత్ తీగలు లేకుండా జాగ్రత్త పడాలి. కూలర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను వాడే సమయంలో అప్రమత్తంగా ఉండాలి. రైతులు పంట రక్షణకు విద్యుత్ తీగలు వినియోగించవద్దు. మోటార్లు ఆన్ చేసే సమయంలో చేతులు తడిగా ఉండకుండా చూసుకోవాలి.
సమాచారం అందించాలి
విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ప్రజలు ముందస్తు జాగ్రత్తలు పాటించాలి. ఇంట్లో వేలాడే విద్యుత్ తీగలు ఉంటే సరిచేసుకోవాలి. కాలం చెల్లిన తీగలు, బోర్డుల స్థానంలో కొత్తవి బిగించుకోవాలి. విద్యుత్ తీగలు వేలాడుతున్నా, స్తంభాలు ఒరిగిపోయి ఉన్నా విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించాలి. సొంతంగా ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద మరమ్మతులు చేయొద్దు.
– అంజల్‌కుమార్,
విద్యుత్‌శాఖ ఏఈ, పెంచికల్‌పేట్