సమ్మె బాటపట్టిన కార్మికులు అనేక గ్రామాల్లో నిలిచిపోయిన తాగునీటి సరఫరా చేతిపంపులు, బోర్లపై ఆధారపడుతున్న ప్రజలు కలుషిత నీటితో పొంచి ఉన్న వ్యాధుల ముప్పు
మిషన్ భగీరథ నీటిని సక్రమంగా సరఫరా చేయాలని ఖాళీ బిందెలతో గత నెల 29న కౌటాల మండలం మొగడ్‌దగడ్‌లో మహిళలు నిరసన వ్యక్తం చేశారు. రెండు వారాలుగా నీరు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో మిషన్ భగీరథ కార్మికుల సమ్మెతో నీటి సరఫరా నిలిచిపోవడంతో పలు గ్రామాల్లో తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలుపుతున్నారు.
కౌటాల(సిర్పూర్): జిల్లాలో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మిషన్ భగీరథ పథకంకింద వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులు సమస్యల పరిష్కారం కోసం సమ్మెకు దిగడంతో సరఫరాకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. దాదాపు 15 రోజులుగా కొన్నిప్రాంతాల్లో పూర్తిగా నిలిచిపోగా, మరికొన్ని ప్రాంతాల్లో నీళ్లు ఎప్పుడు వస్తున్నాయో కూడా తెలియడం లేదు. ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తుండటంతో ప్రజలకు శుద్ధజలం అందడం లేదు. చేతిపంపులు, బోర్లు, బావులపై ఆధారపడి దాహం తీర్చుకుంటున్నారు. వర్షాలకు బావుల్లో నీరు కలుషితం కావడంతో రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రోజులు గడుస్తున్నా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై గ్రామీణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రత్యామ్నాయ చర్యలేవి..?
జిల్లాలో మిషన్ భగీరథ పథకం నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. అసంపూర్తి పైప్‌లైన్లు, లీకేజీలతో పాటు సాంకేతిక సమస్యలు ఏర్పడుతున్నాయి. నిధుల లేమిలో పంచాయతీ సిబ్బంది గ్రామాల్లో క్లోరినేషన్ పనులు నిలిపివేశారు. వర్షాకాలం కావడంతో బావుల్లోని నీటిని తాగితే సీజనల్ వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. తాగునీటి కోసం జిల్లాలోని రెండు వందలకు పైగా గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కార్మికులు సమ్మెలో ఉన్న విషయం తెలిసినా అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టలేదు.
భగీరథ బంద్..!
భగీరథ బంద్..!
భగీరథ బంద్..!