
ముంచిన ‘పెన్‌గంగ’
సిర్పూర్(టి): జిల్లాతోపాటు ఎగువ ప్రాంతంలో ఉన్న మహారాష్ట్ర కురుస్తున్న వర్షాలకు ఈ ఏడాది పెన్‌గంగ ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఎడతెరిపి లేని వర్షాలతో పెన్‌గంగ వరద పరీవాహక ప్రాంతాల్లోని పంటలను ముంచెత్తింది. సిర్పూర్–టి మండలంలోని మాకిడి, హుడ్కిలి, జక్కాపూర్, వెంకట్రావ్‌పేట్, టోంకిని, పారిగాం, లోనవెల్లి గ్రామాల రైతుల పంటలు వరదనీటిలో మునిగిపోయాయి. పత్తితోపాటు మిరప మొక్కలు రోజుల తరబడి వరదలో ఉండటంతో కుళ్లిపోయాయి.
తీవ్రస్థాయిలో నష్టం
సిర్పూర్–టి మండలంలో అనేక గ్రామాలు పెన్‌గంగ పరీవాహక ప్రాంతంలో ఉన్నాయి. అలాగే సిర్పూర్(టి) వాగు, లక్ష్మీపూర్ వాగు, భూపాలపట్నం జీడివాగు, చీలపెల్లి వాగు, ఇటిక్యాల పహాడ్ వాగులు కూడా ఉప్పొంగాయి. ఫలితంగా మండలంలో వందల ఎకరాలు పంటలు వరదనీటిలో మునిగిపోయి రైతులు నష్టపోయారు. వ్యవసాయ శాఖ అధికారులు 400 ఎకరాల వరకు పంటలు దెబ్బతిన్నట్లు అంచనా వేయగా, రైతులు మాత్రం ప్రతీ గ్రామంలో పంటలు దెబ్బతిన్నాయని చెబుతున్నారు. దాదాపు వెయ్యి ఎకరాలకు పైగానే నష్టపోయినట్లు వాపోతున్నారు. వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో మరోసారి పంట సర్వేలు నిర్వహించి రైతులకు పరిహారం అందించాలని కోరుతున్నారు.
రైతులను ఆదుకోవాలి
కొన్ని రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పెన్‌గంగ ఉధృతంగా ప్రవహిస్తోంది. పరీవాహక ప్రాంతాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వం స్పందించి సకాలంలో రైతులకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలి.
– కిర్మరే శ్యాంరావ్, హుడ్కిలి, మం.సిర్పూర్(టి)

ముంచిన ‘పెన్‌గంగ’