
అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎస్సైని సస్పెండ్ చేయాలి
ఆసిఫాబాద్: మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎస్సైని వెంటనే సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి డిమాండ్ చేశారు. ఈ నెల 3న జిల్లా కేంద్రంలో దుర్గా, శారదామాత నిమజ్జనం సందర్భంగా శాంతి యుతంగా ఊరేగింపు చేపట్టిన బ్రాహ్మణవాడ శారదా మండలి మహిళలపై ఎస్సై అనుచిత వ్యాఖ్యలు చేయడం, నిర్వాహకులపై కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ ఆదివారం కేశవనాథ మినీ ఫంక్షన్ హాల్‌లో హిందూ సంఘాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ హిందూ ఉత్సవాలపై పోలీసుల పెత్తనమెంటని ప్రశ్నించారు. డీజేలను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి, యువకులపై కేసులు నమోదు చేయడాన్ని తప్పుపట్టారు. డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాదరావు మాట్లాడుతూ కొత్తగా వచ్చిన సీఐ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. శుక్రవారం రాత్రి ఏఎస్పీ చిత్తరంజన్ ఎస్సైపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి, తెల్లవారుజామున నిర్వాహకులపై కేసులు నమోదు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అసభ్యకరంగా మాట్లాడిన ఎస్సైని సస్పెండ్ చేయాలని, నిర్వాహకులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలన్నారు. దీనిపై లిఖితపూర్వకంగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అరిగెల మల్లికార్జున్ యాదవ్ మాట్లాడుతూ హిందూ ఉత్సవ సమితికి అఖిలపక్షం అండగా ఉంటుందని తెలిపారు. సమావేశంలో హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు ఆకుల సంతోష్, మాజీ ఏఎంసీ చైర్మన్లు చిలువేరు వెంకన్న, గాదెవేణి మల్లేశ్, మాజీ ఎంపీపీ బాలేశ్వర్‌గౌడ్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఖాండ్రే విశాల్ తదితరులు పాల్గొన్నారు.