
అవ్వల్‌పేన్ పూజలకు వేళాయె
కెరమెరి(ఆసిఫాబాద్): కెరమెరి మండలం జోడేఘాట్‌లో సోమవారం సాయంత్రం కుమురంభీం వారసులు అవ్వల్‌పేన్(పోచమ్మ)కు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించనున్నారు. గిరిజనుల హక్కుల కోసం నిజాం ప్రభుత్వంతో సాగిన పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన కుమురంభీం వర్ధంతికి ముందురోజు ఈ పూజ లు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. నిజాం సైనికులను ఎదుర్కొవడంలో భీంకు పోచమ్మ అండగా నిలిచిందని ఆదివాసీలు నమ్ముతారు. అనేకసార్లు భీంపై పోలీసులు కా ల్పులు జరిపినా అమ్మ ఆశీస్సులతోనే ఆయన తప్పించుకునేవారని చెబుతుంటారు. మంత్ర దండం శక్తి ద్వారా తేనెటీగలను అస్త్రాలుగా ఉపయోగించేవారని, ఆముదం విత్తనాలతో తనను తాను రక్షించుకునే వారని విశ్వసిస్తారు. ఈ కారణాలతో ఏటా కుమురంభీం వారసులు, ఆదివాసీలు పోచమ్మ తల్లికి ఘనంగా పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ నేపథ్యంలో సోమవారం జోడేఘాట్‌లోని భీం సమాధి వద్ద నివాళులర్పించనున్నారు. అనంతరం ఆక్కడ జెండాలు ఆవిష్కరిస్తారు. పోచమ్మకు గొర్రెను బలి ఇచ్చి మొక్కులు చెల్లిస్తారు. ఐటీడీఏ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆదివాసీలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టారు.