
అర్హులకు ఇన్సెంటివ్ చెల్లించాలి
రెబ్బెన(ఆసిఫాబాద్): అర్హులైన ప్రతీ కాంట్రాక్టు కార్మికుడికి ఇన్సెంటివ్ చెల్లించాలని ఏఐటీయూసీ బెల్లంపల్లి రీజియన్ అధ్యక్షుడు బోగే ఉపేందర్ డిమాండ్ చేశారు. కోల్ ట్రాన్స్‌పోర్టు లారీ డ్రైవర్లు, క్లీనర్లకు ఇన్సెంటివ్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం గోలేటి సీహెచ్‌పీ దారిలో రాస్తారోకో చే పట్టారు. ఆయన మాట్లాడుతూ సింగరేణి యాజమన్యం ఇటీవల ప్రకటించిన స్పెషల్ ఇన్సెంటివ్ రూ.5500 ఇప్పటికీ చాలా మంది డ్రైవర్లు, క్లీనర్లకు అందలేదని తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏరియా అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న రెబ్బెన ఎస్సై వెంకట్‌కృష్ణ, పర్సనల్ డిపార్టుమెంట్ హెచ్‌వోడీ శ్రీనివాస్ ఘటనాస్థలికి చేరుకుని ఏఐటీయూసీ నాయకులతో మాట్లాడారు. అర్హులకు ఇన్సెంటివ్ అందిస్తామని సింగరేణి అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఏఐటీయూసీ నాయకుల రాస్తారోకోతో బొగ్గు సరఫరా లారీలు నిలిచిపోయాయి. కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి రాయిల్ల నర్సయ్య, కార్మికులు అశోక్, సతీశ్, రాజశేఖర్, రాజలింగు, శ్రీకాంత్, శ్రీనివాస్, రవీందర్, రాజన్న, వెంకటేశ్, హనుమంతు, శ్యాంరావు, విష్ణువర్థన్, గోపాల్ పాల్గొన్నారు.