
ప్రజలకు విజయాలు చేకూర్చాలి
● ఎస్పీ కాంతిలాల్ పాటిల్
ఆసిఫాబాద్: విజయ దశమి ప్రజలకు విజయాలు చేకూర్చాలని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో గురువారం ఆయుధ పూజ, వాహన పూజ, శమీపూజ నిర్వహించారు. దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేశారు. ఎస్పీ మాట్లాడుతూ విజయదశమి పర్వదినం ప్రజలకు సుఖ సంతోషాలు కలిగించాలని ఆకాంక్షించారు. శాంతి భద్రతల పరిరక్షణలో నిత్యం అప్రమత్తంగా ఉండే పోలీసులు తమ విధి నిర్వహణలో ఉపయోగించే ఆయుధాలను దైవ స్వరూపంగా భావించి పూజలు చేయడం సంప్రదాయంగా వస్తుందని తెలిపారు. అనంతరం పోలీసు అధికారులు, సిబ్బంది స్నేహపూర్వకంగా అలయ్ బలయ్ నిర్వహించి శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఎస్పీ, ఏఎస్పీని ఎత్తుకుని సంబురాలు జరుపుకొన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఐలు అంజన్న, పెద్దన్న, సీఐ బాలాజీ వరప్రసాద్, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ రాణాప్రతాప్, ఆర్‌ఎస్సైలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.