
నిషేధ చట్టం కట్టుదిట్టంగా అమలు
ఖమ్మంవైద్యవిభాగం: గర్భధారణకు ముందు, గర్భధారణ సమయాన రోగనిర్ధారణ పద్ధతుల నిషేధ చట్టం కట్టుదిట్టంగా అమలయ్యేలా అధికారులు దృష్టి సారించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. కలెక్టరేట్‌లో మంగళవారం జరిగిన గర్భస్థ పూర్వ, గర్బస్థ లింగ నిర్ధారణ చట్టం జిల్లా అడ్వైజరీ కమిటీ సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కే.వీ.చంద్రశేఖర్‌రావు, పోలీస్ కమిషనర్ సునీల్‌దత్‌తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫర్టిలిటీ సెంటర్లు, స్కానింగ్ సెంటర్లలో చికిత్సకు అయ్యే ఫీజు వివరాలతో బోర్డులు ఏర్పాటుచేయించాలని తెలిపారు. అలాగే, లింగ నిర్ధారణ చట్టం నిషేధంపై అందరికీ అవగాహన కలిగేలా వివరించాలని సూచించారు. పిల్లలు అవసరం లేదని వదిలించుకునే క్రమంలో చంపకుండా దత్తతకు ఉన్న అవకాశాలపై విస్తృత అవగాహన కల్పించాలని చెప్పారు. జిల్లాలో వేయిమంది మగ పిల్లలకు 946 మంది ఆడపిల్లలే జన్మిస్తున్నందున లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన, చేయించుకున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి చంద్రశేఖర్‌రావు మాట్లాడుతూ నిందితులకు శిక్షపడేలా అవసరమైన ఆధారాలు సేకరించాలని సూచించగా, చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని సీపీ సునీల్‌దత్ తెలిపారు. ఈ సమావేశంలో డీఎంహెచ్‌ఓ బి.కళావతిబాయి, జిల్లా సంక్షేమ అధికారి కె.రాంగోపాల్‌రెడ్డి, టి.విష్ణువందన, వివిధ శాఖల అధికారులు, సంస్థల బాధ్యులు చందునాయక్, సి.బిందుశ్రీ, డి.రామారావు, పి.వెంకటరమణ, ఎం.నరేందర్, టి.శంకర్, రెహనా బేగం, ఎస్.మంగళ, జి.అపర్ణ, కుముదిని పాల్గొన్నారు.
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి