
అన్ని రంగాల్లో ఖమ్మం అభివృద్ధి
ఖమ్మంఅర్బన్: ఖమ్మం ప్రజలు ప్రశాంత వాతావరణంలో జీవించేలా కృషి చేస్తూనే అన్ని రంగాల్లో అభివృద్ధికి ప్రణాళికలు అమలు చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం 46వ డివిజన్‌లో అభివృద్ధి పనులకు మంగళవారం శంకుస్థాపన చేసిన ఆయన మాట్లాడుతూ నగరంలో పెరుగుతున్న జనాభాకు తగినట్లుగా సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. రాజకీయ వేధింపులు, అక్రమ కేసులు లేకుండా పాలన సాగుతోందని తెలిపారు. రహదారుల విస్తరణకు ప్రజలు సహకరిస్తేనే ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని చెప్పారు. ఖమ్మంను చూసి ఇతర ప్రాంతాలు అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామని వెల్లడించారు. పేదల సొంతింటి కల నిజం చేసేలా అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు జరుగుతుందని తెలిపారు. కాగా, ఖమ్మం అభివృద్ధి కోసం సీఎం రేవంత్‌రెడ్డి ద్వారా ఎన్ని నిధులైనా తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, కార్పొరేటర్లు కన్నం వైష్ణవి, కమర్తపు మురళి, మార్కెట్ చైర్మన్ యరగర్ల హన్మంతరావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణతో పాటు బాణాల లక్ష్మణరావు, ప్రసన్నకుమార్, సాధు రమేష్‌రెడ్డి, బాలగంగాధర్ తిలక్, తుపాకుల యలగొండస్వామి పాల్గొన్నారు.
●రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం ఖమ్మంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన 18వ డివిజన్ ముస్తఫానగర్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.
రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు