
రైలు నుండి జారిపడి తమిళనాడు వాసి మృతి
ఖమ్మంక్రైం: రైలులో ప్రయాణిస్తున్న తమిళనాడుకు చెందిన వ్యక్తి ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు. చైన్నెకి చెందిన గోపీనాధ్ (41) బ్రతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చి కూలీ పని చేస్తున్నాడు. కుటుంబీకులను చూడడానికి సోమవారం రాత్రి చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో బయలు దేరగా, ఖమ్మం పోలీస్ హెడ్ క్వార్టర్స్ వెనకభాగంలో ప్రమాదవశాత్తు జారి పడగా తీవ్రగాయాలతో మృతిచెందాడు. మృతదేహం వద్ద లభించిన సెల్‌ఫోన్ ఆధారంగా ఆయన వివరాలను గుర్తించిన జీఆర్పీ పోలీసులు కుటుంబానికి సమాచారం ఇచ్చారు.
రెండు కిలోమీటర్లు మృతదేహంతో..
రైలు పట్టాల వెంట గోపీనాధ్ మృతదేహాన్ని గుర్తించిన జీఆర్పీ పోలీసులు అక్కడి నుంచి మెయిన్‌రోడ్‌కు తీసుకురావానికి అన్నం పౌండేషన్ చైర్మన్ శ్రీని వాసరావు సహకారం కోరారు. దీంతో ఆయన తన బృందంతో చేరుకుని మృతదేహన్ని కర్రకు కట్టుకుని రెండు కి.మీ. నడుస్తూ వచ్చి వాహనంలో జిల్లా ఆస్పత్రి మార్చురీకి తరలించారు.
పార్ట్‌టైం ఉద్యోగాల పేరిట రూ.1.57 లక్షలు స్వాహా
ఖమ్మంఅర్బన్: పార్ట్ టైం ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఖమ్మంలో ఇద్దరిని మోసం చేసిన ఘటన వెలుగు చూసింది. ఖమ్మం యూపీహెచ్ కాలనీకి చెందిన కె.అన్వేష్ టెలిగ్రామ్ యాప్‌లో పార్ట్ టైం జాబ్ చేయండి, డబ్బు సంపాదించండి అంటూ వచ్చిన ప్రకటనకు స్పందించాడు. దీంతో ఆయనకు ఫోన్ చేసిన సైబర్ మోసగాళ్లు దఫాలుగా రూ.1.29 లక్షలు కాజేసి ముఖం చాటేశారు. అలాగే, ధంసలాపురం కొత్తూరుకు చెందిన యువతికి కూడాఇలాంటి ప్రకటననే నమ్మి సెప్టెంబర్ 19న రూ.28 వేలు కోల్పోయింది. బాధితుల ఫిర్యాదుతో మంగళవారం కేసులు నమోదు చేసినట్లు ఖమ్మం అర్బన్ సీఐ భానుప్రకాశ్ తెలిపారు.