
ప్రతీ గడపకు బీజేపీ నినాదం
ఖమ్మం మామిళ్లగూడెం: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులతో పాటు పార్టీ విధానాలను గడపగడపకు తీసుకెళ్లాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు సూచించారు. ఖమ్మంలోని జిల్లా కార్యాలయంలో మంగళవారం ఆయన నూతన జిల్లా కార్యవర్గంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ బీజేపీ ఎక్కడుంది అని ప్రశ్నించే వారికి సమాధానాలు చెప్పేలా పార్టీ విధానాలను ప్రజల్లో తీసుకెళ్లాలని, తద్వారా పార్టీ పటిష్టతకు కృషి చేయాలని చెప్పారు. గ్రామస్థాయి మొదలు పట్టణాల వరకు ప్రతీ ఓటరుతో నేరుగా సంబంధం పెట్టుకుని వారి సమస్యల పరిష్కారానికి పాటుపడాలని సూచించారు. అలాగే, ఆరు గ్యారంటీల పేరుతో ఇచ్చిన హామీలను రాష్ట్రప్రభుత్వం విస్మరించిన విషయాన్ని వివరించాలని తెలిపారు. కాగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతీ స్థానం నుంచి బీజేపీ పోటీ చేయనుండగా అర్హులకు అవకాశం కల్పిస్తామని కోటేశ్వరరావు పేర్కొన్నారు. ఈ సమావేశంలో నాయకులు మందడపు సుబ్బారావు, గుత్తా వెంకటేశ్వరరావు, నాయుడు రాఘవరావు, నలగట్టు ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.