
కారులో వచ్చి చోరీకి యత్నం !
ఖమ్మంఅర్బన్: ఎవరికీ అనుమానం రాదనుకున్నాడో.. పారిపోవడం సులువవుతుందని భావించాడో తెలియదు కానీ ఓ ప్రబుద్ధుడు ఏకంగా కారులో చోరీకి వచ్చాడు. కాస్త దూరంలో కారు నిలిపి ఇంటి తాళం పగులగొట్టి నగదు, ఆభరణాలు ఎత్తుకెళ్తుండగా అదే సమయానికి యాజమానులు రావడం, వారి కేకలతో స్థానికులు అప్రమత్తమవడంతో నిందితుడు పట్టుబడ్డాడు. యజమానులతో పాటు స్థానికుల చాకచక్యంతో నిందితుడు పట్టుబడగా చోరీ యత్నం బెడిసికొట్టినట్లయింది. ఖమ్మం జిల్లా కేంద్రంలోని శ్రీనగర్ కాలనీ రోడ్డు నంబర్–8లో బుధవారం పట్టపగలే జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. ఇంటి యజమాని తాళ్లూరి శ్రీనివాసరావు దంపతులు తాళం వేసి సమీపంలో బ్యాంక్‌కు వెళ్లారు. అర గంట తర్వాత వారు వచ్చే సరికి తాళం తొలగించి ఉంది. దీంతో లోపలకు వెళ్తుండగా ఆగంతకుడు మరో తలుపు గుండా బయటకు వెళ్తూ ‘మీ కోసం అంటీ చూస్తోంది’ అంటూ పరుగులు తీశారు. దీంతో శ్రీనివాసరావు దంపతులు ఆయనను దొంగగా గుర్తించి వెంటపడి కేకలు వేస్తుండడంతో ఖమ్మం – వైరా ప్రధాన రహదారిపై నిలిపిన కారు వద్దకు పరుగు తీశాడు. ఇంతలోనే స్థానికులు అప్రమతమై ఆయనను పట్టుకోగా కంపచెట్లులోకి దూకే సమయాన సదరు నిందితుడు చోరీ చేసి నగదు, బంగారం కిందపడ్డాయి. ఈమేరకు స్థానికులంతా ఆయనను బంధించి సమీపంలోని ఖమ్మం అర్బన్ స్టేషన్‌లో అప్పగించారు.
గుంటూరు వాసి.. హైదరాబాద్‌లో నివాసం
చోరీకి యత్నించిన వ్యక్తిని పోలీసులు అప్పగించగా విచారణ చేపట్టారు. ఈమేరకు నిందితుడిని వంశీకృష్ణగా గుర్తించగా, ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన ఆయన ప్రస్తుతం హైదరాబాద్ ఎల్‌బీ నగర్ మల్సూర్‌గూడలో నివాసముంటున్నట్లు తేలింది. గతంలో పలు రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడ్డాడని సమాచారం. ఈ విషయమై ఖమ్మంఅర్బన్ సీఐ భానుప్రకాష్‌ను వివరణ కోరగా బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని, పూర్తి విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.
సొత్తు ఎత్తుకెళ్తూ పట్టుబడిన నిందితుడు

కారులో వచ్చి చోరీకి యత్నం !