
ధాన్యం కొనుగోళ్లకు కార్యాచరణ
ఖమ్మం సహకారనగర్: వానాకాలం సీజన్‌లో రైతులు సాగు చేస్తున్న ధాన్యం కొనుగోళ్లకు కార్యాచరణ రూపొందించాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ఖమ్మంలో బుధవారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఏడాది ఖరీఫ్‌లో 2.95 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, ఈ ఏడాది 3.69 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్ల లక్ష్యంగా నిర్దేశించినట్లు తెలిపారు. సన్న, దొడ్డు రకం ధాన్యం కొనుగోళ్లకు వేర్వేరు కేంద్రాలు ఏర్పాటుచేయడమే కాక అవసరమైన వేయింగ్, తేమ యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు, టార్పాలిన్లు, గన్నీబ్యాగ్‌లు సిద్ధం చేయాలని చెప్పారు. అంతేకాక ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే మిల్లులకు తరలించేలా వాహనాలు సమకూర్చుకోవాలని తెలిపారు. వివిధ శాఖల జిల్లా అధికారులు గంగాధర్, డి.పుల్లయ్య, జి.శ్రీలత, ఎం.ఏ.అలీం, చందన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
టపాసుల దుకాణాల వద్ద ఏర్పాట్లు
దీపావళి సందర్భంగా టపాసుల దుకాణాల ఏర్పాటుకు అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి సూచించారు. కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ ని పోలీస్, మునిసిపల్, రెవెన్యూ, పంచాయతీ శాఖల సమన్వయంతో షాపుల ఏర్పాటుకు స్థలాలు ఖరారు చేయాలని తెలిపారు. ఖమ్మంలోని ఎస్‌ఆర్‌బీజీఎన్‌ఆర్ కళాశాల మైదానంలో షాపుల ఏర్పాటుకు నిబంధనలకు అనుగుణంగా అనుమతులు జారీ చేయాలని సూచించారు. అలాగే, దీపావళి రోజుల ఆస్పత్రుల్లో 24 గంటల పాటు వైద్యులు అందుబాటులో ఉండేలా చూడాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు డీసీపీ ప్రసాదరావు, విద్యుత్ శాఖ ఎస్‌ఈ శ్రీనివాసాచారి, ఎస్‌ఆర్‌బీజీఎన్‌ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ జకీరుల్లా, జిల్లా అగ్నిమాపక అధికారి బి.అజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి