
ప్రగతి సాధించేలా..
విజన్–2030 ద్వారా అభివృద్ధి..
గిరిజన గ్రామాల సమగ్రాభివృద్ధికి
ఆది కర్మయోగి పథకం
ఉమ్మడి జిల్లాలో 28 మండలాల్లో
165 గ్రామాల ఎంపిక
భద్రాద్రి జిల్లాలో రూ.1,355 కోట్ల
అంచనాతో అభివృద్ధి ప్రణాళిక
ఖమ్మం జిల్లాలో నివేదికను సిద్ధం చేస్తున్న అధికారులు
నివేదికలు సిద్ధం
భద్రాచలం: వెనుకబాటుకు గురైన గిరిజన గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. విజన్–2030 పేరుతో గిరిజన గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రణాళిక రూపొందించింది. ప్రజలను, ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలను భాగస్వామ్యం చేస్తూ ఆదికర్మ యోగి అభియాన్ పథకం తెచ్చింది. దీని కింద భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో 28 మండలాల్లో 165 గ్రామాలను ఎంపిక చేసింది. ఇప్పటికే నివేదికలను సిద్ధం చేసిన అధికారులు ఎన్నికల కోడ్ అనంతరం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు అందజేయనున్నారు.
28 మండలాలు.. 165 గ్రామాలు
సేవా, సంకల్పం, సమర్పణం నినాదాలతో ఏజెన్సీ గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, స్వయం ఉపాధి కల్పించనున్నారు. మొదటి ఫేజ్‌లో ఖమ్మం జిల్లాలో 9 మండలాల్లో 35 గ్రామాలకు అవకాశం కల్పించగా, 91,482 గిరిజనులకు లబ్ధి చేకూరే అవకాశం ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 19 మండలాల్లో 130 గిరిజన గ్రామాల్లో 1,37,108 మంది గిరిజనులు పథకం పరిధిలోకి రానున్నారు. కొత్తగూడెం, మణుగూరు మున్సిపాలిటీలను, భద్రాచలం పట్టణాన్ని ఈ పథకం నుంచి మినహాయించారు.
భద్రాద్రి జిల్లాలో రూ.1,355 కోట్లతో ప్రణాళిక
గిరిజన గ్రామాన్ని ప్రాతిపదికగా తీసుకుని ప్రణాళిక రూపొందించారు. ప్రతీ గ్రామంలో ఆది సేవా కేంద్రం ఏర్పాటు చేశారు. గ్రామానికి చెందిన 20 మందిని సభ్యులుగా గుర్తించి సాతి, సహయోగిలను ఎంపిక చేశారు. జిల్లా, మండల, గ్రామాల్లో ట్రైబల్ వెల్ఫేర్, విద్య, వైద్య, రూరల్ డెవలప్‌మెంట్, శిశు సంక్షేమ శాఖకు చెందిన అధికారులను సభ్యులుగా నియమించారు. అధికారులు సాతి, సహయోగిల భాగస్వామ్యంతో ప్రతీ గ్రామంలో రచ్చబండ, గ్రామంలో నడక ద్వారా సమస్యలను గుర్తించారు. గ్రామ కార్యాచరణ ప్రణాళిక నివేదికను సిద్ధం చేశారు. ఆ గ్రామ అడవి, జలవనరులు, మౌలిక సదుపాయాల తదితర అంశాలకు ప్రణాళికలో చోటు కల్పించారు. భద్రాద్రి జిల్లాలో 130 గ్రామాల్లో సుమారు రూ.1,355 కోట్ల నిధుల అవసరాన్ని గుర్తించారు. ఖమ్మం జిల్లా అధికారులు తుది నివేదికను అందజేయాల్సి ఉంది.
కేంద్ర ప్రభుత్వం 2030 నాటికి గిరిజన గ్రామాల్లో అభివృద్ధి, మౌలిక వసతులను కల్పించాలని భావి స్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి నివేదికలను అందగానే నిధులను విడుదల చేసే అవకాశం ఉంది. ప్రతీ గ్రామానికి ఐదేళ్ల కాలంలో సుమారు రూ.2కోట్ల ఖర్చు చేయనున్నట్లు
తెలుస్తోంది. అధి కారులు మాత్రం గ్రామాల అభివృద్ధికి అవసరమైన నిధులపై స్పష్టమైన వివరాలతో నివేదికలను
రూపొందించారు. అంతర్గత రోడ్లు, చెక్‌డ్యాంలు, తాగు, సాగు నీరు వసతులు, విద్యుత్, ఇళ్ల నిర్మాణం, బోర్లు తదితర
అభివృద్ధి పనులను చేపట్టనున్నారు.
జిల్లా, మండల, గ్రామల స్థాయిలో మాస్టర్ ట్రైనింగ్ పూర్తి చేశాం. గ్రామాల్లో పర్యటించి నివేదికలను సిద్ధం చేశాం. నివేదికలు గ్రామసభల్లో ఆమోదం పొందాక జిల్లా లెవల్ రివ్యూ మీటింగ్ అనంతరం అప్రూవల్‌కు పంపిస్తాం. ప్రస్తుతం ఎన్నికల కోడ్ కారణంగా ఈ ప్రక్రియ ఆగిపోయింది. కోడ్ ముగియగానే ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదికలను అందచేస్తాం.
–డేవిడ్‌రాజ్, ఏపీఓ జనరల్, భద్రాచలం ఐటీడీఏ

ప్రగతి సాధించేలా..

ప్రగతి సాధించేలా..