
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి
సాక్షి,బళ్లారి: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. మంగళవారం కొప్పళ జిల్లా హులిగెమ్మ దేవి దర్శనానికి పాదయాత్రగా బయలుదేరిన భక్తులపైకి స్లీపర్ కోచ్ బస్సు దూసుకెళ్లడంతో ముగ్గురు మృతి చెందగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో గదగ్ జిల్లా రోణ తాలూకా తల్లిహాళ గ్రామానికి చెందిన అన్నపూర్ణ(40), ప్రకాష్(25), శరణప్ప(19) అనే ముగ్గురు మృతి చెందారు. మరో మూడు గంటల్లో హులిగమ్మ దర్శనం చేసుకొనే సమయంలో దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదం జరగడంతో అక్కడికక్కడే ముగ్గురు మరణించారు. ఘటనలో మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అలాగే బైక్ ఢీకొనడంతో వీరేష్(28) అనే యువకుడు కూడా మృతి చెందాడు. కుకనూరు గ్రామం నుంచి హులిగమ్మ దేవి దర్శనానికి బయలుదేరిన సమయంలో బైక్ ఢీకొని కింద పడటంతో వీరేష్ మృతి చెందాడు. ఒకే రోజు వేర్వేరు ప్రాంతంలో హులిగమ్మ దేవి దర్శనానికి తరలి వస్తున్న భక్తులపై స్లీపర్ కోచ్ బస్సు, ద్విచక్ర వాహనం ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. ఈ ఘటనలపై ఆయా స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.