
కులగణన సర్వేకు సహకరించాలి
హొసపేటె: కర్ణాటకలో వెనుకబడిన తరగతుల కమిషన్ నేతృత్వంలో చేపట్టిన కులగణన సర్వేకు ప్రజలు సహకరించి విజయవంతం చేయాలని విజయనగర జిల్లా ఆహింద సంఘం ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ బన్నద మనే తెలిపారు. ఆదివారం నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, విద్యా సర్వే జరుగుతోందన్నారు. ఇది నిజంగా దోపిడీకి గురైన వారికి న్యాయం చేసే ప్రయత్నమని తెలిపారు. దళితులు, వెనుకబడిన తరగతులు, మైనార్టీలు శతాబ్దాలుగా రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నా చట్టబద్ధమైన రిజర్వేషన్లు పొందడంలో విఫలయ్యారనేది బహిరంగ సత్యం అన్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వందల కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టిన కులగణన సర్వేలో పాల్గొనాలని కోరారు. కొంతమంది అగ్రకులాల వారు సర్వేను అడ్డుకోవడాన్ని ఖండించారు. ఎమ్మెల్యే హెచ్‌ఆర్ గవియప్ప ఇప్పటికే కులగణన సర్వేలో అందరూ పాల్గొనాలని కోరుతూ కొన్ని సమావేశాలు నిర్వహించడం శుభపరిణామం అన్నారు. అక్టోబర్ 7వ తేదీ సర్వేకు చివరి తేదీగా ఇచ్చారన్నారు. అయితే సర్వే పూర్తి చేయడానికి మరో వారం సమయం ఇవ్వాలని ముఖ్యమంత్రి సిద్దరామయ్యను కోరుతామని పేర్కొన్నారు. శతాబ్దాలుగా రిజర్వేషన్ల వల్ల మోసపోయిన వర్గాలకు సర్వే ఒక వరం అని వెల్లడించారు. వెనుకబడిన తరగతులు, దళితులు, మైనార్టీలు ఈ కుల సర్వేలో తమ కులం పేరు, వంశ వృత్తిని కచ్చితంగా ప్రస్తావించాలన్నారు. హిందుయేతర సమాజం ఎట్టి పరిస్థితుల్లోనూ సర్వేకు దూరంగా ఉండకూడదని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో అధ్యక్షుడు బుడ్డి బసవరాజ్, శివకుమార్, రవికుమార్, సద్దాం, సన్న ఈరప్ప, ప్రశాంత్, ఈరన్న తదితరులు పాల్గొన్నారు.