
గెలుపోటములను సమానంగా స్వీకరించాలి
జాతీయస్థాయి ఫారెస్ట్ క్రీడల్లో పతకాలు సాధించాలి
చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ప్రియాంక వర్గీస్
ప్రారంభమైన రీజినల్ ఫారెస్ట్ ఆటల పోటీలు
కరీంనగర్‌స్పోర్ట్స్: గెలుపోటములను సమానంగా స్వీకరించాలని చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ప్రియాంక వర్గీస్ సూచించారు. కరీంనగర్ సిటీ ప్రాంతీయ క్రీడాపాఠశాల మైదానంలో చేపట్టిన అటవీశాఖ ఉద్యోగుల రీజినల్ క్రీడా పోటీలను మంగళవారం ఆమె ప్రారంభించారు. యూనిఫాం సేవలకు మార్చ్‌ఫాస్ట్ ముఖ్యమన్నారు. క్రీడలు ఉద్యోగులకు ఆటవిడుపుగా పనిచేస్తాయని, పూర్తిసామర్థ్యంతో విధులు నిర్వర్తించేందుకు ఉపయోగపడతాయన్నారు. జాతీయస్థాయిలో పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. అంతకుముందు కరీంనగర్, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాల నుంచి హాజరైన క్రీడాకారులు అతిథులకు క్రీడా వందనం సమర్పించారు. వాలీబాల్, క్రికెట్, అథ్లెటిక్స్, చెస్, క్యారమ్స్ తదితర పోటీలు నిర్వహిస్తున్నారు. కరీంనగర్, మెదక్ ఎఫ్‌ఆర్వోలు బాలమని, జోజి, డీవైఎస్‌వో శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.