
ఊరించి.. ఉసూరుమనిపించారు!
● వేరుశనగ విత్తనాలు ఉచితంగా ఇస్తామని హామీ
● జిల్లాలో ప్రారంభంకాని
సబ్సిడీ విత్తనాల పంపిణీ
● సాంకేతిక సమస్యలతో అడ్డంకులు
● సాగుకు ఆలస్యం అవుతుందని రైతుల ఆందోళన
అయిజ: దేశ వ్యాప్తంగా ‘నేషనల్ మిషన్ ఎన్ ఎడిబుల్ ఆయిల్స్ (ఎన్‌ఎంఈఓ– ఓఎస్) పథకం కింద కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులతో వేరుశనగ విత్తనాలపై 100 శాతం సబ్సిడీ ఇవ్వాల్సి ఉంది. అయితే జిల్లాలోని అయిజ, ఇటిక్యాల, గట్టు మండలాల రైతులకు ఇప్పటి వరకు విత్తనాలు అందలేదు. ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లు (ఎఫ్‌పీఓ), వ్యవసాయ అధికారులు కలిసి ఉచితంగా వేరుశనగ విత్తనాల పంపిణీ చేస్తామని ప్రకటించినా సాంకేతిక సమస్యలు తలెత్తడం, ఏఈఓలకు శిక్షణ ఇవ్వకపోవడంతో ఇప్పటి వరకు విత్తనాల పంపిణీ చేపట్టలేదు. సాగుకు ఆలస్యమవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా.. అధికారులు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది.
ఎదురుచూపులు..
అయిజలో సెప్టెంబర్ 27న ఎమ్మెల్యే విజయుడు చేతుల మీదుగా వేరుశనుగ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని వ్యవసాయ అధికారులు లాంఛనంగా ప్రారంభించారు. సెప్టెంబర్ 30న రైతులందరికీ విత్తనాలు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. సెప్టెంబర్ 29న రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ (ఎఫ్‌పీఓ) కార్యాలయం వద్ద టోకెన్లు తీసుకునేందుకు రైతులు వెళ్లగా ఇవ్వలేదు. సెప్టెంబర్ 30న టోకెన్లు, విత్తనాలు ఒకేసారి ఇస్తామని ప్రకటించడంతో రైతులు ఆ మరుసటి రోజు ఎఫ్‌పీఓ కార్యాలయంవద్ద టోకెన్లు రాయించుకొని, రైతు వేదిక భవనం వద్దకు వెళ్లారు. అయితే ఏఈఓలకు యాప్ డౌన్‌లోడ్ కావడం లేదని, ఉన్నతాధికారులు శిక్షణ ఇవ్వలేదని తెలిపారు. వారంరోజుల అనంతరం విత్తనాలు ఇస్తామని చెప్పడంతో రైతులు నిరాశ చెందారు. ఇటీవల సరైన వర్షాలు కురిసాయని, ఆలస్యం అయితే పదును ఆరిపోతుందని, పొలంలో గడ్డి మెలుస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మంజూరైన వేరుశనగ విత్తనాల
వివరాలిలా..
మండలం రకం క్వింటాళ్లు
అయిజ జీజేజీ–32 587.20
’’ ’’ గిరినార్ – 5 150
ఇటిక్యాల జీజేజీ –32 582
’’ ’’ గిరినార్ – 5 150
గట్టు జీజేజీ – 32 587
’’ ’’ గిరినార్ – 5 150
సాంకేతిక సమస్యలతోనే..
విత్తనాలు ఇవ్వలేకపోవడానికి సాంకేతిక కారణాలు ఉత్పన్నమవుతున్నాయి. ఏఈఓల ఫోన్‌లలో యాప్‌లు డౌన్‌లోడ్ కావడంలేదు. శిక్షణ ఇవ్వనిదే ఏఈఓలు ప్రక్రియను పూర్తి చేయలేమంటున్నారు. పూర్తి స్థాయిలో ప్రణాళిక తయారు చేసుకొని విత్తనాలు పంపిణీ చేస్తాం. – జనార్ధన్, ఏఓ
త్వరలో పంపిణీ చేస్తాం
జిల్లాలోని మూడు మండలాల్లో రైతులకు ఉచితంగా వేరుశనుగ విత్తనాల పంపిణీ చేయాల్సి ఉంది. త్వరగా పంపిణీ చేయాలని ఏఓలకు ఇంతవరకే సూచించాను. పంపిణీ చేయలేదనే విషయం నాకు తెలియదు. త్వరగా పంపిణీ చేసేలా ఆదేశిస్తా. – సక్రియానాయక్, డీఏఓ

ఊరించి.. ఉసూరుమనిపించారు!

ఊరించి.. ఉసూరుమనిపించారు!