
సుప్రీంకోర్టు సీజేఐపై దాడి హేయమైన చర్య
గద్వాల: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్‌పై సోమవారం కోర్టుహాలులో జరిగిన దాడి హేయమైన చర్య అని, ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రజాసంఘాలు, దళిత, ఉపాధ్యాయ, బహుజన సంఘాల నాయకులు తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని స్థానిక అంబేడ్కర్‌చౌరస్తాలో నిరసన తెలిపారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఓ కేసు విచారణలో జరుగుతున్న వాదనల క్రమంలో ఓ మతాన్ని వంటపట్టించుకున్న ఓ మతోన్మాది అయిన న్యాయవాది దేశంలోనే అత్యున్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తిపై దాడికి యత్నించడం క్షమించరానిదని ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు వంటిదన్నారు. దాడికి యత్నించిన న్యాయవాదిని చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు మోహన్, వాల్మీకి, హనుమంతు, ప్రభాకర్, నాగర్‌దొడ్డి వెంకట్రాములు, పల్లయ్య, రాజు, శ్రీనివాసులు పాల్గొన్నారు.
దాడి చేసిన వారిని శిక్షించాలి
సుప్రీంకోర్టు సీజేఐ గవాయ్‌పై సోమవారం కోర్టుహాలులో చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు, దాడిచేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటస్వామి, సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు వేర్వేరు ప్రకటనల్లో డిమాండ్ చేశారు. అతనిపై దేశద్రోహం కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని, దేశఅత్యున్నత ప్రధాన న్యాయమూర్తికే రక్షణ లేదంటే అణగారిన వర్గాలపై వివక్ష, దాడులు ఎంత దారుణంగా జరుగుతున్నాయో అర్థమవుతుందన్నారు. బీజేపీ పాలిత పాలిత రాష్ట్రాలలో మతోన్మాదులు దళితులపై అనేక రకాలుగా అఘాయిత్యాలు చేస్తూ దాడులకు పాల్పడుతున్నారని గుర్తు చేశారు. తక్షణమే కేంద్రం స్పందించి దాడికి పాల్పడిన వ్యక్తిని న్యాయవాద వృత్తి నుంచి శాశ్వతంగా తొలగించాలన్నారు.