అలా.. అయితే ఇలా!
‘స్థానిక’ ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ
స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు ఉంటాయా?.. నిబంధనలకు విరుద్ధమంటూ రద్దు చేస్తారా?..ఒకవేళ రద్దు చేసిన పక్షంలో పాతవే కొనసాగుతాయా?.. అవే కొనసాగితే గత రిజర్వేషన్ల స్థానాలు మారుతాయా?.. లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ పరంగా అమలు చేస్తుందా?.. మిగతా పార్టీలు ఎలా స్పందిస్తాయి? ..ఇలా స్థానిక ఎన్నికల నిర్వహణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 42 శాతానికి బీసీ రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి నేడు హైకోర్టులో విచారణ జరగనుండగా.. ఆశావహులు ఎవరికి వారు ఊహాగానాల్లో మునిగిపోయారు.
ఎన్నికలకు కోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన పక్షంలో అనుకూల రిజర్వేషన్లు వచ్చిన వారు పోరు సన్నాహాలు మొదలు పెట్టేందుకు సిద్ధం అవుతుండగా.. అనుకూలంగా రిజర్వేషన్లు వచ్చిన వారు మారుతాయనే ఆశతో ఉన్నారు. ఏదేమైనా ఆయా వర్గాలకు చెందిన ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు పరిస్థితులకు అనుగుణంగా రెండు రకాల ప్రణాళికలను బేరీజు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బీసీ రిజర్వేషన్ల అంశం హాట్‌టాపిక్‌గా మారింది. – సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్
పార్టీల పరంగానైనా 40శాతం అవకాశం..
మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లో 2019లో జరిగిన స్థానిక ఎన్నికల్లో బీఆర్‌ఎస్ సత్తా చాటింది. ప్రధానంగా కారు, కాంగ్రెస్ మధ్యనే పోరు కొనసాగగా.. బీజేపీ అంతంత మాత్రంగానే ప్రభావం చూపించింది. అయితే ఈసారి మూడు ప్రధాన పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అన్ని పార్టీలు బీసీ నినాదామే ఎజెండాగా ముందుకెళ్తున్న క్రమంలో హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చిన పక్షంలో 42 శాతం బీసీలకు టికెట్లు దక్కనున్నాయి. లేనిపక్షంలో పార్టీల పరంగా అమలు చేస్తే వెనుకబడిన వర్గాలకు 40 శాతమైనా ప్రాతినిధ్యం దక్కే అవకాశం ఉన్నట్లు బీసీ మేధావులు అంచనా వేస్తున్నారు.
గత ఎన్నికల్లో జనరల్ స్థానాల్లోనూ బీసీలు గెలిచారని.. మొత్తంగా సర్పంచ్ ఎన్నికల్లో 38 శాతం, ఎంపీటీసీ ఎన్నికల్లో 43 శాతం వెనుకబడిన వర్గాలకు చెందిన అభ్యర్థులు విజయం సాధించారని ఉదహరిస్తున్నారు. అయితే ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాల్లో బీసీలకు తగిన అవకాశం దక్కలేదని వివరిస్తున్నారు. గత ఎన్నికల్లో మొత్తం 71 జెడ్పీటీసీ స్థానాల్లో 20 బీసీలకు రిజర్వ్ కాగా.. మరో ఆరు జనరల్ స్థానాల్లోనూ గెలుపొందారని చెబుతున్నారు. ఈ లెక్కన 26 మంది బీసీలు జెడ్పీటీసీలుగా ఎన్నిక కాగా.. 42 శాతం రిజర్వేషన్లు అమలైతే 32 స్థానాలు దక్కుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


