
ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేయండి
● గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూడాలి
● కలెక్టర్ బీఎం సంతోష్
గద్వాల: జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో వచ్చే వరిధాన్యం కొనుగోలుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. మంగళవారం ఐడీవోసీ కార్యాలయంలో కాన్ఫరెన్స్‌హాలులో ధాన్యం సేకరణకు సంబంధించి నిర్వాహకులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ పంటకు సంబంధించి నవంబర్ మొదటి వారం నుంచి రైతులు తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చే అవకాశం ఉందన్నారు. ఈక్రమంలో ఈనెల 8వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా 84 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని ఆదేశించారు. కేంద్రాల వద్ద తూకాలు, తేమను నిర్ధారించే యంత్రాలు, గన్నీబ్యాగుల కొరతలేకుండా చూడాలన్నారు. గత సీజన్‌లో కొన్ని చోట్ల గన్నీసంచుల కొరత ఇతర ఇబ్బందులు వలన చాలా మంది రైతులు 15రోజులకు పైగా తమ ధాన్యాన్ని విక్రయించేందుకు వచ్చిన రైతులు వేచిఉన్నారని ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్రాలలో ధాన్యం సేకరణ అనంతరం వెంటనే వాటిని మిల్లులకు తరలించేలా వాహనాలు, హమాలీ వంటివి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్రప్రభుత్వం ఈసారి క్వింటాల్‌కు రూ.69లు పెంచిన నేపథ్యంలో సన్నరకానికి క్వింటాల్‌కు రూ.2389లతో పాటు రాష్ట్ర ప్రభుత్వం రూ.500 బోనస్ కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈసీజన్‌లో జిల్లా వ్యాప్తంగా మొత్తం 2.97లక్షల టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యమని, ఇందుకనుగుణంగా అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ, సివిల్‌సప్‌లై డీఎస్‌వో స్వామికుమార్, డీఎం విమల, కో–ఆపరేటీవ్ అధికారి శ్రీనివాస్, మార్కెటింగ్ అధికారి పుష్పమ్మ, డీఆర్డీఏపీడీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలి
గద్వాల: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. మంగళవారం ఆయన గద్వాల మున్సిపాలిటీలోని 14వార్డులో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. నిర్మాణాల్లో నాణ్యాత ప్రమాణాలు పాటించాలని, నిర్మాణ పనుల ఫొటోలు ఎప్పటికప్పుడు తీసి అందుకు సంబంధించిన డబ్బులను లబ్ధిదారుల ఖాతాలో జమచేయాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ జానకిరామ్, సిబ్బంది పాల్గొన్నారు.
వాల్మీకి జీవితం ఆదర్శప్రాయం
రామాయణ గ్రంథాన్ని లోకానికి పరిచయం చేసిన గొప్ప మహనీయుడు వాల్మీకి మహర్షి అని కలెక్టర్ అన్నారు. వాల్మీకి మహర్షి జయంతి పురస్కరించుకుని కలెక్టరేట్‌లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసినివాళులర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వి.లక్ష్మీనారాయణ, నర్సింగ్‌రావు,ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ మనోజ్‌కుమార్‌రెడ్డి, వాల్మీకి సంఘం నాయకులు పాల్గొన్నారు.