శిక్షకులు లేక.. క్రీడలు దూరం | - | Sakshi
Sakshi News home page

శిక్షకులు లేక.. క్రీడలు దూరం

Oct 8 2025 8:36 AM | Updated on Oct 8 2025 2:25 PM

జూనియర్‌ కళాశాలల్లో వ్యాయామ అధ్యాపకుల కొరత

జిల్లాలోని జూనియర్‌, డిగ్రీ కళాశాలల్లో ఒక్కరూ లేని వైనం

ప్రతిభ ఉన్నా.. విద్యార్థులకు ప్రోత్సాహం కరువు

గద్వాలటౌన్‌: క్రీడలకు ప్రాధాన్యం ఇస్తున్నాం.. క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తున్నాం.. అంటూ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ప్రకటనలు చేస్తున్నా క్షేత్రస్థాయిలోకి వచ్చేసరికి అవి అమలుకాకపోవడంతో కళాశాలల విద్యార్థులు క్రీడా నైపుణ్యాలకు దూరమవుతున్నారు. ప్రతిభ ఉన్న విద్యార్థులను దేశం గర్వించే క్రీడాకారులుగా తీర్చిదిద్దాలంటే ప్రాథమిక స్థాయి నుంచే పునాది పడాలి. విద్యార్థులను ఆటగాళ్లుగా తీర్చిదిద్దే బాధ్యతను విద్యాసంస్థలు స్వీకరించాలి. పాఠశాల మొదలుకొని కళాశాల వరకు క్రీడలకు అనువైన వాతావరణాన్ని కల్పించాలి. కానీ, వాస్తవానికి వచ్చే సరికి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో క్రీడా ప్రమాణాలు అడుగంటి పోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం క్రీడా రంగానికి అధికంగా నిధులు కేటాయిస్తున్నా.. డిగ్రీ, జూనియర్‌ కళాశాలల్లో మాత్రం వ్యాయామ అధ్యాపకుల నియామకాలపై దృష్టి సారించడం లేదు.

ఒక్క వ్యాయామ అధ్యాపకుడూ లేడు..

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో వ్యాయామ అధ్యాపకుల నియామక ప్రక్రియ ఆగిపోవడంతో పీడీలు లేని కళాశాలల సంఖ్య రోజు రోజు రోజుకు పెరుగుతున్నాయి. జిల్లాలో మొత్తం 8 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. ఆరేళ్ల క్రితం వరకు మల్దకల్‌, మానవపాడు, అలంపూర్‌, ధరూర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలకు మాత్రమే వ్యాయామ అధ్యాపకుల పోస్టులు మంజూరయ్యాయి. గతంలో ఆయా కళాశాలల్లో వ్యాయామ అధ్యాపకులు ఉన్నా.. క్రమంగా బదిలీలు, ఉద్యోగ విరమణతో ప్రస్తుతం ఒక్కరూ కూడా లేరు. ప్రభుత్వం ఖాళీలను సైతం భర్తీ చేయలేదు. తరువాత క్రమంలో గద్వాలలో ఉన్న ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, ప్రభుత్వ బాలికల కళాశాల, అయిజ, గట్టు ప్రభుత్వ కళాశాలలకు వ్యాయామ అధ్యాపకులు పోస్టులు మంజూరయ్యాయి. పోస్టులు మంజూరైనప్పటి నుంచి ఈ కళాశాలలో పీడీల నియామకం జరగలేదు. ప్రస్తుతం జిల్లాలోని 8 ప్రభుత్వ కళాశాలల్లో వ్యాయామ అధ్యాపకులు లేకుండానే బోధన జరుగుతోంది. ప్రతిసారి కళాశాల స్థాయిలో పోటీల నిర్వహణపై జరగుతున్న సమావేశాలలో మన జిల్లా తరపున ఒక్కరూ కూడా పాల్గొనడం లేదు. దీంతో జిల్లాలో నిర్వహించే కళాశాలల స్థాయి పోటీలు నిర్వహణ కలగా మారుతోందని, పూర్తిస్థాయిలో విద్యార్థులకు న్యాయం చేయలేకపోతున్నామని పలువురు అధ్యాపకులు పేర్కొన్నారు.

డిగ్రీ కళాశాలల్లోనూ అంతే..

ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోనూ వ్యాయామ అధ్యాపక ఖాళీలు కొన్నేళ్ల నుంచి భర్తీ కావడం లేదు. జిల్లాలో ప్రభుత్వ పీజీ కళాశాలతో పాటు 3 ప్రభుత్వ డిగ్రీ, కళాశాలలు ఉన్నాయి. ఇందులో ఎంఏఎల్‌డీ ప్రభుత్వ ఆర్ట్స్‌ అండ్‌ డిగ్రీ కళాశాలలో మాత్రమే ఒక్క ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టు మంజూరైంది. కానీ, పదేళ్లుగా ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టు ఖాళీగా ఉంది. ఇన్‌చార్జిలతో నెట్టుకొస్తున్నారు. వందల సంఖ్యలో ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఉన్నప్పటికి తర్ఫీదు ఇచ్చే పీడీ లేకుండా పోయారు. 

గద్వాలలోని ప్రియదర్శిని మహిళా డిగ్రీ కళాశాల, శాంతినగర్‌లోని ప్రభుత్వ డిగ్రీ కలశాలలో వ్యాయామ అధ్యాపకుల కొరత ఉంది. డిగ్రీ కళాశాలల్లో వ్యాయామ అధ్యాపకులను నియమించి క్రీడలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా, ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్‌, డిగ్రీ కళాశాలల్లో తప్పక వ్యాయామ అధ్యాపకులు ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు జారీ చేసింది. లేనిపక్షంలో కళాశాల ప్రారంభానికి అనుమతి ఇవ్వొద్దని విద్యాశాఖ అధికారులు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. అయినప్పటికి ప్రైవేటు కళాశాలల వారు వ్యాయామ అధ్యాపకులను నియమించలేదు.

మరుగున పడుతున్న నైపుణ్యం

క్రీడల ప్రోత్సాహానికి పాఠశాల స్థాయిలోనే పునాది పడుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో పీఈటీ, పీడీ పోస్టులను తరుచూ భర్తీ చేస్తున్నా రు. క్రీడాకారులకు ప్రోత్సాహం లభిస్తోంది. ఏటా రాష్ట్ర, జాతీయ స్థాయలో క్రీడోత్సవాలను నిర్వహిస్తుండటంతో చాలామంది క్రీడాకారులు వెలుగులోకి వస్తున్నారు. అండర్‌–14, అండర్‌–17 విభాగంలో ఏటా పాఠశాలల్లో క్రీడలు జరుగుతాయి. మన జిల్లా నుంచి యేటా ప్రభు త్వ పాఠశాలల విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రతిభ చూపుతున్నారు. పాఠశాల విద్య పూర్తయిన తర్వాత ఈ విద్యార్థులు అండర్‌–19 వి భాగంలో జరిగే క్రీడా పోటీల్లో పాల్గొనాలనే ఆసక్తి ఉన్నా, వారికి శిక్షణ ఇవ్వడానికి వ్యాయా మ అధ్యాపకులు లేరు. దీంతో పాఠశాల స్థాయి పోటీలతోనే సరిపుచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. పాఠశాలల నుంచి జూనియర్‌ కళాశాలల్లో చేరిన వారికి అక్కడ శిక్షణ ఇచ్చే వారు లేకపోవడంతో నిరాశే ఎదురవుతోంది.

శిక్షకులు లేక.. క్రీడలు దూరం 1
1/1

శిక్షకులు లేక.. క్రీడలు దూరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement