
భూభారతి దరఖాస్తులు పరిష్కరించాలి
గద్వాల: భూభారతి పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయాన్ని అకస్మికంగా తనిఖీ చేశారు. భూభారతి అమలుతీరుపై సమీక్షించారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులలో ఆయా మాడ్యుల్స్‌లో వచ్చిన దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో అలివేలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
న్యాయమూర్తిపై దాడి దురదృష్టకరం
అలంపూర్: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి ప్రయత్నం దురదృష్టకరమని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గవ్వల శ్రీనివాసులు అన్నారు. అలంపూర్ జూనియర్ సివిల్ కోర్టులో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ బీఆర్ గవాయ్‌పై ఈ నెల 6వ తేదీన దాడి ప్రయత్నానికి నిరసనగా న్యాయవాదులు విధులు బహిష్కరించారు. నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసులు మాట్లాడుతూ.. దేశ అత్యున్నత న్యాయ స్థానంలో ప్రధాన న్యాయమూర్తిపై దాడికి ప్రయత్నించడం బాధాకరమన్నారు. ఈ దాడిని న్యాయ వ్యవస్థపై జరిగిన దాడిగా భావించాల్సి వస్తోందన్నారు. ఇలాంటి ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలన్నారు. దాడి ప్రయత్నానికి నిరసనగా రెండు రోజులపాటు న్యాయవాదులు విధులు బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నరసింహ్మా, సీనియర్ న్యాయవాదులు నారయణ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, ఈదుర్ బాష, గజేందర్ గౌడ్ తదితరులు ఉన్నారు.

భూభారతి దరఖాస్తులు పరిష్కరించాలి