
ప్రారంభం ఘనం.. సేవలు శూన్యం
రూ.17 కోట్లతో జిల్లా కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం
● రెండేళ్లు కావస్తున్నా అందుబాటులోకి రాని వైనం
● షాపులకు డిపాజిట్లు సరిగ్గా లేకపోవడంతో ఆగిన ప్రక్రియ
అందుబాటులోకి ఎప్పుడో?
నిర్మాణం పూర్తి అయి, ప్రారంభమైన ఇంటిగ్రేటెడ్ ఈమార్కెట్ దాదాపు ఏడాది గడుస్తున్నా ఇంతవరకు అందుబాటులోకి రాలేదు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల అనంతరం అప్పటి అడిషనల్ కలెక్టర్ అధికారులతో కలిసి మార్కెట్‌ను సందర్శించారు. అందుబాటులోకి తీసుకురావడానికి అవసరమైన పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అందులో భాగంగా అధికారులు కూరగాయల, ఫ్రూట్ ,మటన్, చికెన్, ఫిష్ వ్యాపారుల అసోసియేషన్ నాయకులతో సమావేశం నిర్వహించారు. మార్కెట్‌లో ఉన్న సౌకర్యాలను చూపించారు. వ్యాపారులు, వీధి వ్యాపారులు ఇక్కడ వ్యాపారం చేసుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారికి సూచించారు. తరువాత షాపులకు సంబంధించి నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. అయితే షాపుల కేటాయింపులో అవలంభించిన రిజర్వేషన్లు, అదేవిధంగా షాపులకు సంబంధించి వచ్చిన డిపాజిట్లు కూడా అనుకున్నంతమేర రాలేదు. దీంతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అందుబాటులోకి తీసుకరావడానికి ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఈ మార్కెట్ అందుబాటులోకి వస్తే ఇక్కడి ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. కూరగాయలు, నిత్యవసర సరుకులు, మటన్, ఫిష్, చికెన్ ఇలా అన్ని ఒకే చోట వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. ఇవన్నీ మార్కెట్ అందుబాటులోకి వస్తేనే సాధ్యపడతాయి. ఇప్పటికై నా అధికారులు త్వరతితగిన నోటిఫికేషన్ ప్రక్రియ పూర్తిచేసి రూ.కోట్లతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకరావాల్సి ఆవశ్యకత ఉంది.
గద్వాల: రూ.కోట్ల వ్యయంతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం పూర్తయి రెండేళ్లు గడుస్తున్నా.. నేటికీ అందుబాటులోకి రాలేదు. దీంతో జిల్లా కేంద్రం గద్వాల పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ (సమీకృత) మార్కెట్ ఇక్కడి ప్రజలకు అందని ద్రాక్షలా మారింది. ఈమార్కెట్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. వ్యవసాయ మార్కెట్‌యార్డు ఖాళీ స్థలంలో 2.30 ఎకరాల్లో అధునాతనంగా దాదాపు రూ.17 కోట్లతో మార్కెట్ నిర్మించారు కానీ, అందుబాటులోకి తీసుకరావడంలో ఇక్కడి అధికారులు విఫలమవుతున్నారు.
అన్ని ఒకేచోట
గద్వాల పట్టణం జిల్లా కేంద్రంగా మారినప్పటి నుంచి చుట్టు పక్కల గ్రామీణ ప్రాంతాల నుంచి ఉద్యోగ, ఉపాధి, విద్యా రంగాల కోసం చాలా మంది పట్టణానికి వచ్చి స్థిరపడుతున్నారు. పట్టణం నలువైపులా విస్తరిస్తోంది. ఈక్రమంలో ప్రజలకు తగ్గట్టుగా సౌకర్యాల కల్పనపై పాలకులు, అధికారులు దృష్టి సారించారు. పట్టణంలో ఉన్న మటన్, ఫిష్ మార్కెట్‌లు చిన్నవిగా ఉన్నాయి. కూరగాయల మార్కెట్ పెద్దదిగా ఉన్న అది కూడా ఒక్కటే ఉన్నది. అన్నీ ఒకే చోట ఉంటే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందనే ఉద్దేశ్యంతో మార్కెట్‌యార్డు ఆవరణలో 2.30 ఎకరాల స్థలంలో స్టేట్ డెవలెప్‌మెంట్ ఫండ్ దాదాపు రూ.17 కోట్లతో నిర్మాణం పూర్తి చేశారు. 2021 సెప్టెంబర్ 14న శంకుస్థాపన అయిన మార్కెట్‌ను గడిచిన అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు ప్రారంభించారు.

ప్రారంభం ఘనం.. సేవలు శూన్యం