
తప్పుల తడక..
● మృతిచెందిన, ఉద్యోగ విరమణ చేసిన వారికి డ్యూటీలు
● ఎన్నికల విధుల్లో బయటపడిన అధికార యంత్రాంగ డొల్లతనం
గద్వాలటౌన్: ఎన్నికల నిర్వహణకు ముందే అధికార యంత్రాంగం డొల్లతనం బయటపడుతోంది. ఎన్నికల నిర్వహణ నిమిత్తం ఉపాధ్యాయులకు విధులు కేటాయిస్తూ తయారు చేసిన జాబితాలు తప్పుల తడకగా మారాయి. చనిపోయిన వారికి, ఉద్యోగ విరమణ పొందిన వారితో పాటు దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న వారికి, నెల రోజుల వ్యవధిలో పదవీ విరమణ పొందుతున్న వారికి చోటు కల్పించారు. ఇలా ఇష్టారాజ్యంగా, నిర్లక్ష్యంగా జాబితాలు రూపొందంచడంపై విమర్శలకు తావిస్తోంది. జిల్లాలో ఆర్‌ఓలు, పీఆర్‌ఓలుగా ఉపాధ్యాయులను నియమించిన అధికారులు వారికి శిక్షణ ఇస్తున్నారు. శిక్షణకు హాజరు కావాలని జాబితా విడుదల చేశారు. సోమవారం ప్రిసైడింగ్ అధికారులకు ఆయా మండలాల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. శిక్షణకు హాజరైన క్రమంలో ఉపాధ్యాయులు జాబితాలో ఉన్న తప్పులను గుర్తించారు. జాబితాలో తప్పులు దొర్లడం, సీనియర్లకు బదులు జూనియర్లకు పైస్థాయి హోదా కలిగిన బాధ్యతలు అప్పగించడం మరింత చర్చనీయాంశంగా మారుతోంది. జాబితాలో దొర్లిన తప్పులపై పలువురు ఉపాధ్యాయులు ఎంపీడీఓలతో వాదనకు దిగడంతో సరిచేస్తామని హామీఇచ్చారు.
మచ్చుకు కొన్ని...
● కేటీదొడ్డి మండలం ఇర్కిచేడు ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎంగా పనిచేస్తున్న హుస్సేని రెండు నెలల క్రితం గుండెపోటుతో మృతి చెందారు. ఆయనకు ప్రిసైడింగ్ అధికారిగా నియమిస్తూ సోమవారం ఉదయం 10 గంటలకు కేటీదొడ్డి మండలంలో జరిగే శిక్షణ కార్యక్రమానికి హాజరుకావాలని ఉత్తర్వులు జారీ కావడంపై ఉపాధ్యాయ సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
● గద్వాల మండలం గోనుపాడు ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎం శేషయ్య గత నెల పదవీ విరమణ పొందారు. ఆయనకు పీఓగా విధులు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇలా పదవీ విరమణ చెందిన మరికొందరికి ఎన్నికల విధులు కేటాయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
● కేటీదొడ్డి ఎంఈఓ వెంకటేశ్వరరావు వచ్చే నెలలో పదవీ విరమణ చేయనున్నారు. అలాగే, గద్వాల ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాల జీహెచ్‌ఎం వెంకటనర్సయ్య డిసెంబర్‌లో పదవీ విరమణ చేయనున్నారు. ఆరు నెలల లోపు పదవీ విరమణ చేయనున్న ఉపాధ్యాయులకు ఎన్నికల విధులు కేటాయించకూడదని నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. అయినా వారికి ఎన్నికల విధులు కేటాయించారు.
జిల్లాలో చాలా చోట్ల జిల్లా పరిషత్ పాఠశాలలో హెచ్‌ఎంకు పీఓగా నియమిస్తే.. అదే పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న స్కూల్ అసిస్టెంట్లకు ఆయన కంటే పైస్థాయి ఆర్‌ఓ బాధ్యతలు అప్పగించారు. ఇలా జాబితాలో చోటు చేసుకున్న తప్పులపై ఉపాధ్యాయులు ఆసహనం వ్యక్తం చేస్తున్నారు. తప్పులను సరిదిద్దే పనిలో ఎంపీడీఓలు ఉన్నారు.