
ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
గద్వాల క్రైం: ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించొద్దని ఎస్పీ శ్రీనివాసరావు సిబ్బందికి సూచించారు. సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో జిల్లా నుంచి వివిధ గ్రామాలకు చెందిన బాధితులు ఎస్పీకి ఫిర్యాదులు చేశారు. ప్రధానంగా భూ వివాదం, ఆస్తి తగదాలు, అప్పుగా తీసుకున్న వ్యక్తులు డబ్బులు చెల్లించడం లేదని ఇలా 12 మంది ఫిర్యాదులు చేశారు. వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తామని ఎస్పీ బాధితులకు వివరించారు. సివిల్ సమస్యలపై కోర్టు ద్వారా పరిష్కారం చేసుకోవాలన్నారు.
వేరుశనగ క్వింటాల్ రూ.5,009
గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్ యార్డుకు సోమవారం 238 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. గరిష్టం రూ. 5009, కనిష్టం రూ. 2729, సరాసరి రూ. 4809 ధరలు లభించాయి. అలాగే, 377 క్వింటాళ్ల ఆముదాలు రాగా, గరిష్టం రూ. 5802, కనిష్టం రూ. 5661, సరాసరి రూ. 5720 ధరలు పలికాయి.
టన్ను చెరుకుకు
రూ.6 వేల ధర ఇవ్వాలి
అమరచింత: కేంద్ర ప్రభుత్వం క్వింటాల్ పత్తికి రూ.7వేల మద్దతు ధర ఇచ్చినట్లుగానే టన్ను చెరుకుకు రూ.6 వేల మద్దతు ధర ప్రకటించాలని కృష్ణవేణి చెరుకు రైతు సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాజన్న డిమాండ్ చేశారు. దీంతో పాటు ఈ సంవత్సరం చెరుకు రైతులకు కృష్ణవేణి చెరుకు ఫ్యాక్టరీ ఇస్తున్న సబ్సిడీలను వచ్చే ఏడాది కూడా వర్తింపచేయాలని కోరారు. చెరుకు రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం రైతులతో కలిసి ఫ్యాక్టరీ జీఎం వీపీ రామరాజుకు వినతిపత్రం అందించారు. అనంతరం ఫ్యాక్టరీ సిబ్బందితో కలిసి సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ సంఘం వినతి మేరకు కృష్ణవేణి చెరుకు ఫ్యాక్టరీ యాజమాన్యం గతేడాది నుంచి చెరుకు రైతులకు పంటలపై సబ్సిడీలను అందిస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఇస్తున్న సబ్సిడీలను 2026–2027 సీజన్‌లో కూడా వర్తింపచేయాల్సిన అవసరం ఉందన్నారు. పెరిగిన ధరల ప్రకారం కంపెనీ ఇస్తున్న బోనస్‌తో కలిపి టన్ను చెరుకుకు రూ.ఆరు వేల మద్దతు ధరను ఇవ్వాలన్నారు. చెరుకు రైతులకు ఇబ్బంది లేకుండా ఫ్యాక్టరీ యాజమాన్యం కార్మికులను ముందస్తుగా రప్పించి, పంట కోతలు పూర్తి చేసి వెంటనే డబ్బులను చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతు సమస్యలను పరిష్కరిస్తామని, సబ్సిడీలను వచ్చే సంవత్సరం కూడా కొనసాగిస్తామని ఫ్యాక్టరీ జీఎం హామీ ఇవ్వడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో కృష్ణవేణి చెరుకు రైతు సంఘం ఉమ్మడి జిల్లా నాయకులు వాసారెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, నారాయణ, రాజశేఖర్, చంద్రసేనారెడ్డి, రంగారెడ్డి, రవి, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.