
సన్నాలకు సై..
న్యూస్‌రీల్
శనివారం శ్రీ 4 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
● జిల్లాలో 1,04,194 ఎకరాల్లో వరి సాగు
● బోనస్ ప్రకటించడమే కారణం..
● గత సీజన్‌నుంచే వర్తింపు
భూపాపపల్లి రూరల్: ప్రభుత్వం మద్దతు ధరతో పాటు గతేడాది నుంచి సన్న ధాన్యానికి అదనంగా క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తుండటంతో రైతులు సన్న ధాన్యం సాగుకు మొగ్గు చూపారు. ఈ వానాకాలం సీజన్‌లో జిల్లావ్యాప్తంగా ఉద్యాన పంటలు కలిపి 2.24 లక్షల ఎకరాలల్లో వివిధ పంటలు సాగు చేశారు. వరి 1,15,653 ఎకరాల్లో సాగు చేశారు. అందులో 1,04,194 ఎకరాలు సన్న ధాన్యం సాగుచేయగా 11,459 ఎకరాల్లో దొడ్డు ధాన్యం సాగుచేశారు. అంతకుముందు ఏడాది సన్నాలు 30వేల ఎకరాలకు మించి సాగు చేసిన దాఖలాలు లేవు. జిల్లా వ్యాప్తంగా ఈ లెక్కన ఇంత పెద్దమొత్తంలో సన్నాలు సాగుచేయడానికి కారణం ప్రభుత్వం రూ.500 బోనస్ ఇవ్వడమే.
రైతులకు అదనపు ఆదాయం..
జిల్లాలో గతేడాది యాసంగి సీజన్‌లో 87,650 ఎకరాల్లో సన్నాలు సాగుచేయగా 23 వేల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం కొనుగోలు చేశారు. క్వింటాకు రూ.2310 మద్దతు ధరకు కొనుగోలు చేశారు. అదనంగా ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ చెల్లించింది. జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్‌లో 1,04,194 ఎకరాల్లో సన్నధాన్యం సాగుచేశారు. సుమారుగా ఎకరాకు 25 క్వింటాల్‌కు పైగా దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు.
తెగుళ్ల బారిన సన్నాలు..
జిల్లాలో సన్నాలకు తెగుళ్లు వ్యాపిస్తున్నాయి. ముఖ్యంగా అగ్గితెగులు, పచ్చదోమ, తెగులు సోకుతున్నాయి. దీంతో దిగుబడిపై ప్రభావం చూపనుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం పంట పొట్టదశకు వచ్చింది. ఈ దశలో పంటలను కాపాడుకునేందుకు వ్యవసాయ అధికారులు సూచనలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.

సన్నాలకు సై..