
స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి
గోవిందరావుపేట: కాంగ్రెస్ పార్టీ కన్నతల్లి లాంటిదని, రిజర్వేషన్ తనకు అనుకూలం కాకున్నా స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడమే లక్ష్యంగా పనిచేస్తానని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ పిలుపునిచ్చారు. మండల పరిధిలోని చల్వాయి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం మండల అధ్యక్షుడు పాలడుగు వెంకటకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పైడాకుల అశోక్ హాజరై మాట్లాడుతూ.. కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని, పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. రిజర్వేషన్ తనకు అనుకూలంగా రాకపోయినా పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని అన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, పేదల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందని తెలిపారు. పార్టీ కోసం పని చేసే ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం కల్పిస్తామని అన్నారు. కార్యక్రమంలో కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, దాసరి సుదాకర్, జెట్టి సోమయ్య, కణతల నాగేందర్, కాంగ్రెస్ పార్టీ మండల, గ్రామ నాయకులు పాల్గొన్నారు.
పలువురిపై కేసు నమోదు
గోవిందరావుపేట: మండలంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గురువారం దసరా, రావణసుర వధ ల సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని పస్రా ఎస్సై అచ్చ కమలాకర్ తెలిపారు. పండుగ శాంతియుతంగా జరగడానికి ముందస్తుగానే మద్యం, మాంసం దుకాణ యజమానులకు కౌన్సెలింగ్ ఇచ్చి దుకాణాలను మూసివేయించామని తెలిపారు. నిబంధనలను ఉల్లఘించి బెల్ట్ షాప్‌లు నడిపిన నలుగురిపై కేసులు నమో దు చేసినట్టు పేర్కొన్నారు. పస్రాలోని రావణ వధ వద్ద మద్యం మత్తులో వీధుల్లోకి వచ్చి పోలీసులకు ఆటంకం కలిగించిన ఐదుగురిపై కూడా కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.
గాంధీ విగ్రహానికి కార్మికుల వినతి
ఏటూరునాగారం: గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల్లో డైలీ వైజ్ వర్కర్లుగా పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చేస్తున్న నిరవధిక సమ్మె 22వ రోజుకు చేరుకుంది. నిరసనలో భాగంగా కార్మికులు .. ఎంపీడీఓ ఆఫీస్ నుంచి బొడ్రాయి ప్రాంతంలోని మహాత్మా గాంధీ విగ్రహం వరకు ర్యాలీగా వచ్చి గాంధీ విగ్రహానికి పూలదండ వేసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దావూద్ మాట్లాడుతూ.. గాంధీ అహింసా సిద్ధాంతం మేరకు శాంతియుతంగా 22రోజులుగా సమ్మె చేస్తూ నిరసన తెలియజేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్కర్లు 22 రోజులుగా సమ్మె చేస్తుంటే సమస్య పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేయడం ప్రభుత్వానికి తగదని అన్నారు. డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం యూనియన్ నాయకులతో చర్చలు జరపాలని కోరారు. ఓ పక్క గత ఎనిమిది నెలల నుంచి జీతాలు లేక కుటుంబం గడవక తీవ్రమైన ఇబ్బందులు పడుతుంటే మరోపక్క వేతనాలను తగ్గిస్తూ జీఓ 64ను తీసుకురావడం దుర్మార్గమని అన్నారు. అర్హులైన అందరికీ టైం స్కేల్ ప్రకారం అమలు అయ్యేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో చిటమట రమేష్, నాగలక్ష్మి, భాగ్యలక్ష్మి, జయలక్ష్మి, సత్యం, సమ్మక్క, కమల, విజయలక్ష్మి, రాజు, సమ్మయ్య, సూర్యతేజ, ఇందిర, సుమలత, సాంబయ్య, శివకృష్ణ, సత్యం పాల్గొన్నారు.
వీరన్న సన్నిధిలో
భక్తుల సందడి
కురవి: మండల కేంద్రంలోని భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయంలో దసరా పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం స్వామి, అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. స్వామిని దర్శించుకునేందుకు క్యూలో వేచి ఉన్నారు. దసరా సందర్భంగా వాహన పూజలు అధికంగా జరిగాయి. వాహనాలు బారులుదీరి కనిపించాయి.

స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి