
దసరా సంబురం
● జమ్మికి పూజలు, పాలపిట్ట దర్శనం
● రావణుడి ప్రతిమలు దహనం
● భారీగా హాజరైన జనం
భూపాలపల్లి అర్బన్: జిల్లా వ్యాప్తంగా దసరా వేడుకలు గురువారం వైభవంగా నిర్వహించారు. పలు ఆలయాల్లో జమ్మిచెట్టు వద్ద పూజలు, రావణ వధ కార్యక్రమాలు చేశారు. పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేకాలు చేశారు. దుర్గామాత ఆలయాలకు భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. భారీ సంఖ్యలో వాహన పూజలు చేపట్టారు. జిల్లాకేంద్రంలోని కృష్ణాకాలనీ క్రీడామైదానంలో గురువారం రాత్రి మున్సిపాలిటీ, సింగరేణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రావణాసుర వధ కార్యక్రమాన్ని తిలకించడానికి వేలాది మంది తరలివచ్చారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు జబర్దస్త్ టీం సభ్యులు చేపట్టిన వినూత్న కార్యక్రమాలను సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభించారు. చుట్టు గ్రామాలు, పట్టణంలోని పలు కాలనీల్లో నుంచి కుటుంబసభ్యులతో కలిసి సింగరేణి క్రీడామైదానానికి అధిక సంఖ్యలో ప్రజలు చేరుకున్నారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ.. భూపాలపల్లి పట్టణంలో అన్ని వార్డుల్లో ప్రజల మౌలిక సదుసాయాల కల్పన కోసం అత్యధికంగా నిధులు వెచ్చించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వేదిక ప్రాంతంలో సీఐ నరేష్‌కుమార్ పర్యవేక్షణలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. అనంతరం 40 అడుగుల ఎత్తుతో ఏర్పాటుచేసిన రావణాసుర వధకు ఎమ్మెల్యే సత్యనారాయణరావు నిప్పు అంటించారు.
కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో
విజయదశమి వేడుకలను గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. క్యాంపు కార్యాలయంలో వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యాలయ వాహనాలను వినియోగించే సిబ్బందితో కలిసి కలెక్టర్ పూజలో పాల్గొన్నారు.

దసరా సంబురం

దసరా సంబురం