మంత్రి ప్రత్యేక పూజలు | - | Sakshi
Sakshi News home page

మంత్రి ప్రత్యేక పూజలు

Oct 2 2025 8:31 AM | Updated on Oct 2 2025 8:31 AM

మంత్ర

మంత్రి ప్రత్యేక పూజలు

రామప్పలో ఇంగ్లండ్‌ దేశస్తుడు నీటిమునిగిన పంటల పరిశీలన

కాటారం: దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండలకేంద్రంతో పాటు ఎర్రగుంటపల్లి, ధన్వాడ గ్రామాల్లో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహాల వద్ద రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవార్లను దర్శించుకొని పూజా కార్యక్రమాలు చేశారు. ఈ సందర్భంగా పండితులు వేదమంత్రోచ్ఛరణల నడుమ అర్చనలు చేసి అమ్మవారి ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు అందజేశారు. మంత్రి వెంట కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు వేమునూరి ప్రభాకర్‌రెడ్డి, యూత్‌ కాంగ్రెస్‌ నియోజకవర్గ అధ్యక్షుడు చీమల సందీప్‌, ఆర్యవైశ్య సంఘం సభ్యులు, కాంగ్రెస్‌ నాయకులు ఉన్నారు.

విజయదశమి శుభాకాంక్షలు

భూపాలపల్లి రూరల్‌: జిల్లా ప్రజలకు కలెక్టర్‌ బుధవారం ఒక ప్రకటనలో విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. విజయదశమి ప్రతి కుటుంబంలో సుఖశాంతులు, ఆనందం, ఆరోగ్యం నింపాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషం వెల్లివిరియాలని కోరుకున్నారు.

54 శాతం బొగ్గు ఉత్పత్తి

భూపాలపల్లి అర్బన్‌: భూపాలపల్లి ఏరియాలోని కాకతీయ బొగ్గు గనులలో సెప్టెంబర్‌ నెలలో 54 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు ఏరియా సింగరేణి జనరల్‌ మేనేజర్‌ రాజేశ్వర్‌ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏరియాలోని గనుల్లో 3.17 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాల్సి ఉండగా 1.71 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి మాత్రమే సాధించినట్లు తెలిపారు. గతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఓపెన్‌ కాస్ట్‌లో ఉత్పత్తికి తీవ్ర విఘాతం కలగడంతో ఉత్పత్తి వెనుకబడిపోయినట్లు కనిపిస్తుందని తెలిపారు. అక్టోబర్‌ నెలలో 4.23 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి టార్గెట్‌ను విధించినట్లు చెప్పారు. బొగ్గు ఉత్పత్తికి సింగరేణి కార్మికులు సహకరించాలని కోరారు. ఉద్యోగులందరూ రక్షణ సూత్రాలు పాటించాలని, రక్షణ విషయంలో యాజమాన్యం రాజీపడేది లేదన్నారు.

కోడిపందేల స్థావరంపై దాడి

కాటారం(మహాముత్తారం): మహాముత్తారం మండలం కోనంపేట శివారులో నిర్వహిస్తున్న కోడిపందేల స్థావరంపై బుధవారం ఎస్సై–2 మహేశ్‌ ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేశారు. మండలంలోని పలు గ్రామాలకు చెందిన వ్యక్తులు కోడిపందేలు నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు దాడి జరిపినట్లు ఎస్సై–2 మహేశ్‌ తెలిపారు. ఘటనా స్థలంలో కోడిపందేలు ఆడుతున్న 9 మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.13,300 నగదు స్వాధీనపర్చుకున్నట్లు తెలిపారు. మహాముత్తారానికి చెందిన రవి, రాజేందర్‌, రాజేశ్‌, నిఖిల్‌, రవి, రమేశ్‌, శ్రీకాంత్‌, నాగారం గ్రామానికి చెందిన పక్రుద్దీన్‌, రమేశ్‌లపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేందర్‌కుమార్‌ తెలిపారు. పండుగ సందర్భంగా గ్రామాల్లో పేకాట, కోడిపందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఎస్సై హెచ్చరించారు. ప్రజలు దసరా పండుగ ప్రశాంతంగా, సంతోషంగా జరుపుకోవాలని సూచించారు.

వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని ఇంగ్లండ్‌కు చెందిన పర్యాటకుడు నికోలస్‌ సందర్శించారు. రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న ఆయనకు ఆలయ పూజారులు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. ఆలయ శిల్పకళ విశిష్టతను గైడ్‌ విజయ్‌ కుమార్‌ వివరించారు. అనంతరం నికోలస్‌ లక్ష్మీదేవిపేటలో దసరా క్రీడల్లో భాగంగా కబడ్డీ పోటీలను వీక్షించారు. అమరావతి విద్యాలయం మైదానంలో జరిగిన ఫైనల్‌ పోటీల్లో పట్వారిపల్లి, నర్సింగాపూర్‌ జట్లు తలపడ్డాయి. ఈ పోటీలలో లక్ష్మీపురం ప్రథమ బహుమతి, నర్సింగాపూర్‌ ద్వితీయ బహుమతి, బూర్గుపేట తృతీయ బహుమతిని గెలుచుకున్నాయి. కబడ్డీ పోటీలు అద్భుతంగా జరిగాయని, క్రీడాకారులు బాగా రాణించారని నికోలస్‌ ప్రశసించారు. నర్సింగాపూర్‌కు చెందిన తన మిత్రుడి ఇంటికి వచ్చిన సందర్భంలో నికోలస్‌తో పలువురు గ్రామస్తులు, క్రీడాకారులు ఫొటోలు దిగారు.

కన్నాయిగూడెం: గోదావరి వరదతో నీట మునిగి దెబ్బతిన్న పంటలను వ్యవసాయశాఖ అధికారి మహేశ్‌ అధికారులతో కలిసి పరిశీలించారు. బుధవారం మండల పరిధిలోని గూర్రేవుల, సింగారం, బుట్టాయిగూడెం, చింతగూడెంతో పాటు ఇతర గ్రామాల్లో నీట మునిగిన పంటలను పరిశీలించినట్లు తెలిపారు.

మంత్రి ప్రత్యేక పూజలు
1
1/1

మంత్రి ప్రత్యేక పూజలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement