
కాళేశ్వరం దేవస్థానం ఏసీ స్థాయి పెంపు?
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ (ఏసీ) స్థాయి హోదాను దేవాదాయశాఖ పెంచుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఆ దిశగా కసరత్తులు పూర్తిచేసినట్లు తెలిసింది. ప్రస్తుతం 6ఏ ఆలయంగా ఉన్న దేవస్థానంలో గ్రేడ్–2 ఈఓ విధులు నిర్వర్తిస్తున్నారు. 2027 జూలైలో జరుగు గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని ఏసీ(అసిస్టెంట్ కమిషనర్)స్థాయి పెంచుతున్నారని తెలిసింది. దేవస్థానం క్యాడర్ స్ట్రెంత్ ప్రకారం మరింత మంది ఉద్యోగులు, అర్చకుల అవసరం ఉండనుంది. ఆలయ వార్షికాదాయం రూ.6కోట్లకు చేరింది. మే నెలలో జరిగిన సరస్వతినది పుష్కరాల సమయంలోనే ఏసీ స్థాయి పెంపుపైన చర్చకు వచ్చింది. మంథని ఎమ్మెల్యే, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ ప్రత్యేక శ్రద్ధతో ఆలయ అభివృద్ధి కోసం స్థాయి పెంచుతున్నారని తెలిసింది. రెండు నెలల కిందటనే ఆలయ ఆదాయ, వ్యయాలు, డిపాజిట్లు, ఇతర వివరాలను కమిషనర్ కార్యాలయానికి పంపారు. 2016లో అప్పటి సీఎం కేసీఆర్, రూ.25కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ ఏడాది మే నెలలో జరిగిన సరస్వతి నది పుష్కరాల్లో రూ.35 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను చేపడుతున్నారు. దీంతో ఆలయం మరింత అభివృద్ధి చెందుతుందని భక్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని రోజుల్లో ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఉత్తర్వులు రానున్నట్లు సమచారం.