
సద్దులకు సిద్ధం..
భూపాలపల్లి అర్బన్: సద్దుల బతుకమ్మను సోమ, మంగళవారాల్లో నిర్వహించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహిళలకు అసౌకర్యం కలగకుండా జిల్లావ్యాప్తంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సద్దుల బతుకమ్మ జరుపుకునే ప్రాంగణాలు, ఆలయ ప్రాంగణాలు ముస్తాబు చేశారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధితో పాటు జిల్లావ్యాప్తంగా గ్రామాల్లో ప్రాంగణాలు సిద్ధం చేశారు. జలాశయాల వద్ద, దేవాలయాల్లో, పలు కూడళ్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. బతుకమ్మలను నీటిలో వదిలే సమయంలో ఇబ్బందులు చోటు చేసుకోకుండా బృందాలను జలాశయాల వద్ద ఉంచనున్నారు. పోలీస్ యంత్రాంగం ఇప్పటికే బందోబస్తుపై దృష్టి సారించింది. బతుకమ్మ జరుపుకునే ప్రాంతాల్లో ఏర్పాట్లను అధికారులు పరిశీలిస్తున్నారు.
సందడి షురూ..
పుట్టింటికి వచ్చిన ఆడబిడ్డలు.. వైభవంగా బతుకమ్మ పండగను జరుపుకునేందుకు పూలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఇక కొత్త బట్టల కొనుగోళ్లతో సందడి నెలకొంది. పండుగను పురస్కరించుకొని గ్రామాల నుంచి కొందరు పూలను సేకరించి తీసుకొచ్చి పట్టణంలో విక్రయిస్తున్నారు.
విద్యుత్ వెలుగుల్లో ఆటపాటలు
భూపాలపల్లి పట్టణంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో బతుకమ్మ పండుగను కనుల పండువగా జరుపుకునేందుకు ప్రభుత్వ శాఖలు సహకరిస్తున్నాయి. ప్రధానంగా మున్సిపల్, గ్రామ పంచాయతీల్లో రంగురంగుల విద్యుత్ అలంకరణలతో ప్రాంగణాలు ముస్తాబు చేస్తున్నారు. ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేస్తున్నారు. పట్టణంలో పెద్దఎత్తున వేడుకలను నిర్వహించేందుకు అంబేడ్కర్ స్టేడియం, వారాంతపు సంత, హనుమాన్, అయ్యప్ప, రామాలయాల్లో వేదికలు ముస్తాబు చేస్తున్నారు.
పూలకు భలే గిరాకీ
చివరి రోజైన సద్దుల బతుకమ్మ కోసం అందంగా బతుకమ్మలు పేర్చేందుకు ఆడపడుచులు పూల సేకరణలో నిమగ్నమయ్యారు. ఆదివారం గ్రామాల నుంచి కొందరు తంగేడు, గునుగు, టేకు, బంతి పూలను జిల్లాకేంద్రంతో పాటు మండల కేంద్రాల్లోకి తీసుకువచ్చి విక్రయిస్తుండగా ధరలు కూడా ఎక్కువగానే చెబుతున్నారు. తంగేడు పూల కట్టను సైజును బట్టి రూ.10 నుంచి రూ.50 వరకు విక్రయిస్తున్నారు. గునుగు పూల కట్ట రూ.20 నుంచి రూ.30 వరకు, ఇక బంతి పూలను ప్రాంతాన్ని బట్టి రూ.80నుంచి రూ.100 వరకు అమ్ముతున్నారు. ఇతర రకాల పూలకు కూడా బాగానే గిరాకీ ఉంది.
ముస్తాబవుతున్న బతుకమ్మ ప్రాంగణాలు
మున్సిపాలిటీ పరిధిలో ప్రత్యేక ఏర్పాట్లు
జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో పర్యవేక్షణ
రెండు రోజుల సద్దుల బతుకమ్మ..
గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది బతుకమ్మ పండగపై తీవ్ర అయోమయం నెలకొంది. నేడు(సోమవారం), మంగళవారం నిర్వహించుకోవాలని పండితులు రెండు రకాల తేదీలను ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 30వ తేదీన నిర్వహించాలని సర్క్యూలర్ జారీ చేసింది. బతుకమ్మను ప్రతి ఏడాది సంప్రదాయబద్ధంగా తొమ్మిదో రోజున జరుపుకుంటారని అందులో భాగంగానే అధిక శాతం గ్రామాల్లో నేడు(సోమవారం) జరుపుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. బతుకమ్మలను పేర్చుకునేందుకు పూలను కొనుగోలు చేసుకున్నారు. కొన్ని గ్రామాల్లో మంగళవారం నిర్వహించుకోనున్నారు.

సద్దులకు సిద్ధం..

సద్దులకు సిద్ధం..

సద్దులకు సిద్ధం..