
నేడు సద్దుల బతుకమ్మ జరుపుకోండి
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో సోమవారం(నేడు) సద్దుల బతుమ్మను ప్రాంతీయ ఆచారంగా మహిళలు జరుపుకోవాలని కాళేశ్వరం దేవస్థానం ఉపప్రధాన అర్చకుడు పనకంటి ఫణీంద్రశర్మ, అర్చకులు వెల్ధి శరత్‌చంద్రశర్మ ఆదివారం తెలిపారు. అమావాస్య నుంచి 9వ రోజున సద్దుల బతుకమ్మ జరుపుకోవాలని, సప్తమితో కూడిన అష్టమి ఒకే రోజు రావడంతో సందిగ్ధం నెలకొందన్నారు. సందేహం లేకుండా ప్రాంతీయ ఆచారంగా సద్దుల బతుకమ్మ వేడుకలను 29న (నేడు) సోమవారం జరుపుకోవాలని మహిళలకు విజ్ఞప్తి చేశారు. బతుకమ్మ వేడుకలు జరుపుకుకొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు.
ఘనంగా భగత్‌సింగ్ జయంతి
భూపాలపల్లి రూరల్: భగత్ సింగ్ 118వ జయంతిని పురష్కరించుకొని ఆదివారం జిల్లాకేంద్రంలోని భగత్ సింగ్ విగ్రహానికి ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) జిల్లా కన్వీనర్ నాగుల అరవింద్ క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా అరవింద్ మాట్లాడుతూ.. దేశ స్వాతంత్రం కోసం 23 సంవత్సరాల వయస్సులోనే ప్రాణాలు త్యాగం చేసిన మహనీయుడు భగత్‌సింగ్ అన్నారు. ఆయన ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
అక్టోబర్ 3న సెలవు ఇవ్వాలి
భూపాలపల్లి అర్బన్: దసరా పండుగ రోజున గాంధీ జయంతి అవుతున్న నేపథ్యంలో సింగరేణి కార్మికులకు అక్టోబర్ 3వ తేదీన సెలవు ప్రకటించాలని బీఎంఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్ యాజమన్యాన్ని కోరారు. ఈ మేరకు ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే దసరా పండుగ, గాంధీ జయంతిని గొప్పగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. సమైక్యత, సమగ్రత కోసం దసరా పండుగ సెలవుదినాన్ని మార్చాలని యాజమాన్యాన్ని కోరారు. ఈ సమావేశంలో నాయకులు సుజేందర్, మల్లేష్, శ్రీనివాస్, సదానందం, శ్రీనివాస్, రఘుపతిరెడ్డి, సాగర్, సదానందం, స్వామి, మొగిలి పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపిక
మల్హర్: జటాధార ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఆధ్వర్యంలో జెట్ ఇన్నోవేటివ్ రాష్ట్ర స్థాయి అవార్డులకు ఇద్దరు టీచర్లు ఎంపికయ్యారు. మల్హర్ మండలం తాడిచర్ల జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయుడు వనపర్తి కుమారస్వామి, భూపాలపల్లి మండలం గొల్లబుద్ధారం డీఎన్‌టీ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు జయ ఎంపికయ్యారు. నేడు (సోమవారం) సికింద్రాబాద్‌లో హరిహర కళాక్షేత్రంలో నిర్వహించే కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రదానోత్సవం చేయనున్నారు. అవార్డుకు ఎంపిక కావడం పట్ల పలువురు ఉపాధ్యాయులు వారిని అభినందించారు.
సద్దుల బతుకమ్మ
శుభాకాంక్షలు
భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆదివారం ఒక ప్రకటనలో సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లేలా, ప్రజలంతా సుఖశాంతులతో జీవించి, దినదినాభివృద్ధి పొందేలా దీవించాలని అమ్మవారిని ఎమ్మెల్యే ప్రార్థించారు.

నేడు సద్దుల బతుకమ్మ జరుపుకోండి

నేడు సద్దుల బతుకమ్మ జరుపుకోండి