
యూరియా కోసం రైతుల ఆందోళన
కాటారం: అన్నదాతలకు యూరియా కష్టాలు తప్పడం లేదు. సరిపడా యూరియా అందకపోవడంతో రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి నెలకొంటుంది. కాటారం మండలకేంద్రంలోని పీఏసీఎస్ గోదాంలో యూరియా ఉన్నప్పటికీ పంపిణీలో జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తూ శనివారం కాటారం మండలకేంద్రంలో రైతులు ఆందోళన చేపట్టారు. పీఏసీఎస్ గోదాం ఎదుట కాటారం–మంథని ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. ఉదయం నుంచి గోదాం ఎదుట పడిగాపులు కాస్తున్నా యూరియా పంపిణీ ప్రారంభించలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా కోసం వ్యవసాయ పనులు వదిలిపెట్టుకొని తిరగాల్సిన దుస్థితి నెలకొందని అన్నారు. రైతుల ఆందోళనకు బీఆర్‌ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. యూరియా పంపిణీలో ప్రభుత్వం విఫలమైందని, మంత్రి శ్రీధర్‌బాబు సొంత మండలంలో రైతులు యూరియా కోసం తంటాలు పడుతున్నారని విమర్శించారు. ఎస్సై శ్రీనివాస్, వ్యవసాయశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని రైతులను సముదాయించారు. యూరియా పంపిణీ చేపట్టేలా చర్యలు తీసుకున్నారు.
యూరియా సరిపడా పంపిణీ చేస్తాం..
కాటారం: యూరియా కోసం రైతులు ఆందోళన చెందవద్దని.. సాగుకు సరిపడా యూరియా సరఫరా అవుతుందని జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాబురావు అన్నారు. కాటారం మండలకేంద్రంలోని పీఏసీఎస్ గోదాం, రేగులగూడెం, దామెరకుంట రైతువేదికల్లో యూరియా పంపిణీని డీఏఓ శనివారం పరిశీలించారు. యూరియా కోసం వచ్చిన రైతుల పట్టాపుస్తకం, ఆధార్‌కార్డు జిరాక్స్‌లను పరిశీలించి టోకెన్‌లు అందజేయించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా యూరియా పంపిణీ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. యూరియా నిల్వలపై ఆరా తీశారు. డీఏఓ వెంట ఏఓ పూర్ణిమ, ఏఈఓలు ఉన్నారు.