
పత్తి కొనుగోళ్లకు సన్నద్ధం
భూపాలపల్లి రూరల్: ప్రభుత్వం తరఫున సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా ఐదు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి పత్తి కొనుగోలు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధర కంటే బహిరంగ మార్కెట్‌లోనే పత్తి ధర అధికంగా ఉండడం, తేమ పేరుతో రైతులను ఇబ్బందులకు చేయడంతో గతేడాది పెద్దగా రైతులు కొనుగోలు కేంద్రాలపై ఆసక్తి చూపలేదు. చాలాచోట్ల తేమ శాతం సాకుగా చూపి మోసంచేసిన ఘటనలు కూడా అక్కడక్కడ జరగడం రైతులను కొంత నష్టపరిచింది.
జిల్లాలో 98,680 ఎకరాల్లో పత్తి సాగు
జిల్లాలోని భూపాలపల్లి నియోజకవర్గంలో భూపాలపల్లి 1 చిట్యాల 2 మంథని నియోజకవర్గంలో కాటారంలో 2 జిన్నింగ్ మిల్లులు ఉండగా అన్నింటిలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలో 98,680ఎకరాల్లో పత్తి సాగు చేయగా 9లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అధిక వర్షాలు, తెగుళ్ల కారణంగా పత్తి దిగుబడిపై కొంత ప్రభావం చూసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వం క్వింటాలు పత్తికి రూ.8,110గా ధరను నిర్ణయించింది. సీసీఐ ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు తమ పంటను అమ్ముకుంటే న్యాయం జరిగే అవకాశం ఉందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో తేమ పేరుతో రైతులకు నిర్ణయించిన ధర కంటే తక్కువగా ఇస్తారని, తూకాల్లో కూడా అవకతవకలు ఉంటాయని, రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని అధికారులు సూచిస్తున్నారు.
ఆధార్ అనుసంధానం తప్పనిసరి
జిల్లాలో అక్టోబర్ నెలలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించే అవకాశం ఉంది. పత్తి కొనుగోళ్లు, ఇతరత్రా విషయాల్లో పారదర్శకంగా రైతుల బ్యాంక్ ఖాతాకు అనుసంధానం ఉండాలనే నిబంధన పెట్టారు. పత్తి కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చే సమయంలో ఆధార్ కార్డులతో పాటు పాస్‌బుక్ కూడా వెంట తెచ్చుకోవాలని సూచిస్తున్నారు. రైతులు తమ వివరాలను కిసాన్ యాప్‌లో నమోదు చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు.
అక్టోబర్‌లో కొనుగోళ్లు ప్రారంభం..
జిల్లాలో 5 పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశాం. అక్టోబర్ రెండు, మూడో వారంలో కొనుగోళ్లు ప్రారంభిస్తాం. దళారులను నమ్మకుండా సీసీఐ కొనుగోలు కేంద్రాల్లోనే పత్తిని విక్రయించాలి.
– ప్రవీణ్‌రెడ్డి, జిల్లా మార్కెటింగ్ అధికారి
జిల్లావ్యాప్తంగా 5 సీసీఐ కేంద్రాల ఏర్పాటు
అక్టోబర్ రెండో వారంలో
ప్రారంభించే అవకాశం
9 లక్షల క్వింటాళ్ల దిగుబడి అంచనా
మద్దతు ధర క్వింటాకు రూ.8,110
వర్షాలకు దిగుబడి తగ్గే అవకాశం

పత్తి కొనుగోళ్లకు సన్నద్ధం

పత్తి కొనుగోళ్లకు సన్నద్ధం