శ్రీమహాలక్ష్మీదేవిగా అమ్మవార్ల దర్శనం | - | Sakshi
Sakshi News home page

శ్రీమహాలక్ష్మీదేవిగా అమ్మవార్ల దర్శనం

Sep 27 2025 5:05 AM | Updated on Sep 27 2025 5:07 AM

కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయ అనుబంధ దేవాలయాలైన శ్రీఽశుభానందదేవి(పార్వతి), శ్రీసరస్వతి అమ్మవార్లు శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు శ్రీమహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శణమిచ్చారు. శుక్రవారం ఆలయ అర్చకులు అమ్మవార్లను ప్రత్యేకంగా పట్టువస్త్రాలు, పూలతో అలంకరించారు. అర్చకులు విశేష పూజాకార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదం అందజేశారు. భజన కార్యక్రమాలు చేశారు. అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

27 అడుగులకు

గణపసముద్రం

గణపురం: రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మండలకేంద్రంలోని గణపసముద్రం చెరువు 27 అడుగుల నీటి మట్టానికి చేరుకుంది. గణపసముద్రం చెరువు మొత్తం నీటి మట్టం 30 అడుగులు కాగా మరో 3 అడుగుల నీటి మట్టం చేరుకుంటే గణపసముద్రం చెరువు మత్తడి పడనుంది. గణపసముద్రం చెరువుపై ఉన్న గొలుసు చెరువులైన భాగీర్థిపేట, రామన్నగూడెం, బుద్ధారం, వంగపల్లి వాని చెరువులు మత్తళ్లు పోస్తుండడంతో పాటు రామప్ప సరస్సు నుంచి పెద్ద ఎత్తున వరద వస్తుంది. దీంతో మరో రోజు వర్షం కురిస్తే చెరువు పూర్తిగా నిండి మత్తడి పోయనుంది. రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

రక్తదాన శిబిరానికి

విశేష స్పందన

భూపాలపల్లి అర్బన్‌: జిల్లా కేంద్రంలో మిరాకిల్‌ వాలంటరీ ఆర్గనైజేషన్‌, ఐటీ మాస్టర్స్‌ కంప్యూటర్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించినట్లు ఆర్గనైజేషన్‌ డైరెక్టర్‌ వేముల శంకర్‌ తెలిపారు. ఈ సందర్భంగా శంకర్‌ మాట్లాడుతూ.. రక్తదాన శిబిరానికి ప్రజలు సేవాభావంతో ముందుకు వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేసినట్లు తెలిపారు. సేకరించిన 103 యూనిట్లను వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి అందించినట్లు చెప్పారు. రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్న శంకర్‌ను ఎంజీఎం వైద్యులు అభినందించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు వేముల కుమార్‌, సురేందర్‌, సిబ్బంది శ్వేత, శివాజీ, కిరణ్‌ పాల్గొన్నారు.

వర్షంతో నష్టం

కాటారం: కాటారం, మహాముత్తారం మండలాల్లో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో అపార నష్టం జరిగింది. పలు గ్రామాల్లో పత్తి పంటలు నీట మునిగాయి. వరద నీరు నిల్వడంతో పత్తి మొక్కలు ఎర్రబారాయి. దీంతో రైతులకు తీవ్ర నష్టం చేకూరింది. మండలంలోని రేగులగూడెంలో పోశయ్య అనే వ్యక్తికి చెందిన ఇళ్లు వర్షానికి నేల మట్టమైంది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.

గోడకూలి మహిళ మృతి

కాళేశ్వరం: వరుసగా కురుస్తున్న వానలతో తడిసిన ఓ ఇంటి గోడ కూలడంతో మహిళ మృతిచెందిన ఘటన బెగుళూర్‌ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మంద లక్ష్మి(42) కొంతకాలం నుంచి పక్షవాతంతో మంచానికే పరిమితమైంది. ఈక్రమంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు శుక్రవారం తెల్లవారుజామున ఇంటి గోడకూలి ఆమైపె పడడంతో అక్కడికక్కడే మృతి చెందింది. భర్త దుర్గయ్యకు స్వల్ప గాయాలయ్యాయి. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు మహదేవపూర్‌ ఎస్సై–2 సాయిశశాంక్‌ తెలిపారు. తహసీల్దార్‌ రామారావు, డీటీ కృష్ణ పంచనామా నిర్వహించారు.

శ్రీమహాలక్ష్మీదేవిగా అమ్మవార్ల దర్శనం1
1/1

శ్రీమహాలక్ష్మీదేవిగా అమ్మవార్ల దర్శనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement