
ఐలమ్మ స్ఫూర్తితో ముందడుగు
● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
భూపాలపల్లి అర్బన్: ఐలమ్మ పోరాటపటిమ, పట్టుదలను స్ఫూర్తిగా తీసుకొని ముందడుగు వేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. వీరనారి చాకలి ఐలమ్మ 130వ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం కలెక్టరేట్‌లోని మీటింగ్‌హాల్‌లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో కలెక్టర్ రాహుల్‌శర్మతో కలిసి పాల్గొని చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ పోరాట ఉద్యమ నాయకురాలు వీరనారి చాకలి ఐలమ్మ జయంతిని అధికారికంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టి సముచితంగా గౌరవించినట్లు తెలిపారు. నాటి రోజుల్లో రజాకారులను, భూ స్వాములను ఎదిరించి పోరాడిన యోధురాలని కొనియాడారు. ఆమె ఆశయాలను ఆచరణలో పెట్టి అమలు చేయాల్సిన బాధ్యతను మనందరం తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. త్యాగానికి పోరాటానికి స్ఫూర్తిగా వీరనారి చాకలి ఐలమ్మ నిలిచారని తెలిపారు. చాకలి ఐలమ్మ సింబల్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్‌మెంట్‌గా నిలిచారన్నారు. నాటి రోజుల్లో పెత్తందారులకు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేయడం చాలా గొప్ప విషయమన్నారు. ఈ సమావేశంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి ఇందిర, వివిధ కుల సంఘాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఐలమ్మను స్మరించుకోవాలి
భూపాలపల్లి అర్బన్: నిజాం రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీరవనిత చాకలి ఐలమ్మను స్మరించుకోవాలని అదనపు ఎస్పీ నరేశ్‌కుమార్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ 130వ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి అదనపు ఎస్పీ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయ స్థానం సంపాదించారన్నారు. సామాజిక న్యాయం, పేదల హక్కుల కోసం పోరాడిన ఆమె నిజమైన వీరవనిత అన్నారు. ఆమె ధైర్యసాహసాలు, పోరాటస్ఫూర్తి ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమన్నారు. తెలంగాణ ఆత్మగౌరవం కోసం ఐలమ్మ చేసిన త్యాగాలు ఈ తరం వారికి ఆదర్శమన్నారు. వారి ఆశయాలను కొనసాగించడం మనందరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఫర్హాన, రత్నం, శ్రీకాంత్, ఆర్‌ఎస్‌ఐలు పోలీస్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

ఐలమ్మ స్ఫూర్తితో ముందడుగు