
ఎన్నికల ప్రక్రియపై అవగాహన ఉండాలి
● కలెక్టర్ రాహుల్‌శర్మ
భూపాలపల్లి అర్బన్: స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియపై పీఓ, ఏపీఓలు సమగ్ర అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని మీటింగ్‌హాల్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై పీఓలు, ఏపీఓలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు. ఎన్నికల ప్రక్రియ చాలా ముఖ్యమైనదన్నారు. లోటు పాట్లు లేకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు ఎన్నికల ప్రక్రియపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. రెండో విడత శిక్షణ కార్యక్రమం నిర్వహించడంతో పాటు నిర్వహించిన శిక్షణపై ఎన్నికల సంఘం సూచనల మేరకు పరీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు. బ్యాలెట్ పేపర్ పద్ధతిలో ఎన్నికలు ఉంటాయని పోలింగ్ కేంద్రంలో చేయాల్సిన ఏర్పాట్లు, పోలింగ్ నిర్వహణ తదితర అంశాలను మాస్టర్ ట్రైనర్లు సమగ్రంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తారని, ఏదేని సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవాలని సూచించారు.ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీపీఆర్‌ఓ శ్రీనివాస్, సీపీఓ బాబురావు, భూపాలపల్లి ఎంపీడీఓ నాగరాజు, ఆర్వోలు, ఏఆర్వోలు పాల్గొన్నారు.
అసత్య ప్రచారాలు నమ్మొద్దు
జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో చెరువులు తెగిపోయాయన్న అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని, వదంతులను ప్రజలు నమ్మకూడదని కలెక్టర్ రాహుల్‌శర్మ తెలిపారు. ప్రస్తుతం జిల్లా పరిధిలోని చెరువులు అన్ని పటిష్టమైన స్థితిలో భద్రంగా ఉన్నాయని, ఎక్కడా ఇబ్బందులు తలెత్తలేదని స్పష్టంచేశారు. సంబంధిత ప్రాంతాల్లో ఇరిగేషన్ డీఈఈలు, ఏఈఈలు, లష్కర్లు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అధికారుల నుంచి అందే సమాచారం తప్ప వేరే వదంతులను నమ్మవద్దన్నారు. సామాజిక మాధ్యమాలు, ఇతర మార్గాల్లో అసత్య ప్రచారాలు చేసి ప్రజలను భయబ్రాంతులకు గురిచేసే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.