
మద్యం టెండర్లకు దరఖాస్తులు
భూపాలపల్లి: మద్యం షాపుల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. డిసెంబర్ 1వ తేదీ నుంచి కొత్త షాపులు (ఏ4) ప్రారంభం కానుండగా టెండర్ల ప్రక్రియను ఇప్పటి నుంచే ప్రారంభించింది.
రెండు జిల్లాల్లో 59 షాపులు..
జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలో మొత్తం 59 మద్యం షాపులకు టెండర్లు ఆహ్వానించారు. ఇందులో రిజర్వేషన్ ప్రాతిపదికన ఎస్సీలకు 7, గౌడ కులస్తులకు 9, ఓపెన్ కేటగిరీలో 32, ములుగు జిల్లాలో ఎస్టీలకు 11 దుకాణాలను కేటాయించారు. మూడు స్లాబ్‌లో ఉన్న ఈ షాపులకు నేటి (శుక్రవారం) నుంచి అబ్కారీ శాఖ అధికారులు దరఖాస్తులు స్వీకరించనున్నారు. వచ్చే నెల 18వ తేదీ సాయంత్రం వరకు దరఖాస్తులు స్వీకరించి, 23న డ్రా తీసి షాపులను కేటాయించనున్నారు. డ్రా పద్ధతిలో షాపులు దక్కించుకున్న వారు డిసెంబర్ 1 నుంచి రెండేళ్ల పాటు మద్యం షాపులను నడుపుకోనున్నారు. కాగా గతేడాది దరఖాస్తు ఫీజు రూ. 2 లక్షలు ఉండగా ఈ ఏడాది ప్రభుత్వం రూ. 3 లక్షలకు పెంచింది.
నేటి నుంచి వచ్చే నెల
18వ తేదీ వరకు స్వీకరణ
అక్టోబర్ 23న డ్రా,
దరఖాస్తు ఫీజు రూ.3 లక్షలు
ములుగు, భూపాలపల్లి
జిల్లాల్లో 59 షాపులు