
పశు జన్యువనరులపై అవగాహన
కాళేశ్వరం: మహదేవపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక పశువైద్యశాల ఆవరణలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎనిమల్ జెనెటిక్స్ అండ్ బ్రీడింగ్ వారు ఐసీఏఆర్ నెట్‌వర్క్ ప్రాజెక్టు కింద పశు జన్యు వనరులపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని పీవీఎన్‌ఆర్ తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన సుమారు 62 మంది పాడి రైతులు, జీవాల పెంపకం దారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు వైద్యులు ఏకాంబరం, సరిన్ కార్తికేయన్, గోపాల కృష్ణమూర్తి, వెంకన్నలు పలు సూచనలు చేశారు. వారికి నాటు పశు సంపద గుర్తింపు ఆవశ్యకత, దానివల్ల కలిగే ప్రయోజనాలు గురించి నిపుణులు సవివరంగా తెలియజేశారు. పర్యావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉన్న జాతులను గుర్తించి, వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యంతో ఉన్న జాతులను అభివృద్ధి చేసి, వ్యవసాయాన్ని స్థిరంగా నిలుపుకోవచ్చన్నారు. జాతుల చరిత్ర, సంబంధాలు తెలుస్తాయని వెల్లడించారు. రైతుల సందేహాలను నివృత్తి చేస్తూ పాడి పరిశ్రమకు మరింత ఊతమిచ్చే విధంగా యూనివర్సిటీలోని లాభసాటి పద్ధతులను ప్రత్యక్షంగా సందర్శించడానికి మండల రైతులను ఆహ్వానించినట్లు వెల్లడించారు.గవర్నర్ చేతుల మీదుగా డాక్టరేట్ స్వీకరించిన మహదేవపూర్ మండల పశువైద్యుడు బుర్ర రాజబాబును మండల రైతులు అందరూ కలిసి ప్రత్యేకంగా సన్మానించారు. కార్యక్రమం ముగిసిన అనంతరం, అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న రైతులకు యూనివర్సిటీ తయారు చేసిన మినరల్ మిక్సర్ ప్యాకెట్లు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి గార్లతో పాటు శాఖ సిబ్బంది, గోపాలమిత్రలు, పశుమిత్రలు పాల్గొన్నారు.

పశు జన్యువనరులపై అవగాహన