
యూరియా అక్రమ రవాణాపై నిఘా
● కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి: యూరియా అక్రమ రవాణాపై పటిష్ట నిఘా ఉంచాలని కలెక్టర్ రాహుల్ శర్మ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. యూరియా సరఫరా, క్రాప్ బుకింగ్, ఉద్యాన పంటలు సాగు తదితర అంశాలపై బుధవారం ఐడీఓసీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో వ్యవసాయ, ఉద్యానవనశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో యూరియా సరఫరాపై టాస్క్‌ఫోర్స్ టీంలు పటిష్టమైన నిఘా పెంచాలన్నారు. యూరియా ఎక్కువగా విక్రయాలు జరుగుతున్న మండలాల నివేదిక అందించాలన్నారు. పీఏసీఎస్ కేంద్రాల వద్ద రైతులకు సరిపడేంత నిల్వలు ఉంచాలని స్పష్టం చేశారు. యూరియా అక్రమ రవాణా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. టాస్క్‌ఫోర్స్ టీంలు ఆకస్మికంగా రిటైల్ షాపుల్లో తనిఖీలు చేపట్టాలని, ప్రైవేటు డీలర్లు కొన్ని చోట్ల బ్లాక్ చేసే అవకాశం ఉందన్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో యూరియాకు కొరత లేదన్నారు. వ్యవసాయ, ఉద్యాన పంటలు, క్రాప్ బుకింగ్ వేగవంతం చేయాలని ఆదేశించారు. మొగుళ్లపల్లి మండలంలోని కొన్ని గ్రామాల్లో గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణానికి భూ సేకరణ చేసినట్లు తెలిపారు. ఆ భూముల్లో పంటలు సాగు చేయకుండా, అలాగే సాగులో ఉన్న పంటలు త్వరితగతిన పూర్తి చేసేందుకు రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. ఈ సమావేశంలో డీఏవో బాబురావు, ఉద్యానవనశాఖ అధికారి సునీల్‌కుమార్, వ్యవసాయ శాఖ ఏడీఏలు, హార్టికల్చర్ అధికారులు పాల్గొన్నారు.