
స్కానింగ్ సెంటర్లు నిబంధనలు పాటించాలి
● డీఎంహెచ్‌ఓ మధుసూదన్
భూపాలపల్లి అర్బన్: స్కానింగ్ సెంటర్ల నిర్వహకులు నిబంధనలు పాటించాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి మధుసూదన్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని స్కానింగ్ సెంటర్ల నిర్వహణపై బుధవారం డీఎంహెచ్‌ఓ తన కార్యాలయంలో జిల్లా మెడికల్ అడ్వైజరీ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ జిల్లాలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న స్కానింగ్ సెంటర్లతో పాటు ఇప్పటికే ఉన్న స్కానింగ్ సెంటర్ల అనుమతి గురించి అడ్వైజర్ కమిటీ ముందుంచామన్నారు. ఆరోగ్యశాఖ ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సీనియర్ సివిల్ జడ్జి నాగరాజు మాట్లాడుతూ లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరమన్నారు. సెక్స్ రేషియో తక్కువగా ఉన్నటువంటి మండలాలు ఒడితల, రేగొండ, కాటారం, చెల్పూర్, మహాముత్తారం, ఆజాంనగర్‌లు, ఏఎన్‌ఎంలకు విడతల వారీగా సమావేశం నిర్వహించి డాక్యుమెంట్ ఫిల్మ్ ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారిణి శ్రీదేవి, గైనకాలజిస్టులు కవిత, డాక్టర్ అనీషా, పీడియాట్రిషన్ డాక్టర్ సుధాకర్, సోషల్ వర్కర్ ప్రసాద్, డెమో శ్రీదేవి పాల్గొన్నారు.