
ఆదాయంపై పట్టింపేది..?
భూపాలపల్లి మున్సిపల్‌లో వ్యాపార భవనాలు 1,427
భూపాలపల్లి: నివాస భవనాలపై ఆస్తి పన్నును ముక్కుపిండి మరీ వసూలు చేసే మున్సిపాలిటీ అధికారులు ట్రేడ్ లైసెన్స్‌లు జారీచేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. వ్యాపార సముదాయాలకు అందించే కేటగిరి 2 విద్యుత్ మీటర్ల సంఖ్య, ము న్సిపల్ అధికారులు జారీ చేసిన ట్రేడ్ లైసెన్స్‌లకు వేలల్లో వ్యత్యాసం ఉంది. ఫలితంగా మున్సిపల్ ఆదాయానికి రూ.లక్షల్లో గండి పడుతోంది.
1967 భవనాల తేడా..
భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో నివాస భవనాలు 10,952, నివాస, వ్యాపార భవనాలు 834, వ్యాపార 593, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ భవనాలు 1,211 ఉన్నాయి. ఈ మేరకు 1,427 వ్యాపార భవనాలకు ట్రేడ్ లైసెన్స్‌లు ఉన్నట్లు మున్సిపల్ అధికారులు వెల్లడించారు. ఇందులో సైతం ఇప్పటి వరకు 986 మాత్రమే జారీ చేశారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా... వ్యాపార, పరిశ్రమలకు ఎన్పీడీసీఎల్ అధికారులు జారీ చేసే కేటగిరి 2, 3, 4 మీటర్ల సంఖ్యకు, మున్సిపల్ అధికారులు జారీచేసిన ట్రేడ్ లైసెన్స్‌ల సంఖ్యకు ఏమాత్రమూ పొంతన కుదరడం లేదు. భూపాలపల్లి అర్బన్ పరిధిలో కమర్షియల్ మీటర్లు 3,394 ఉన్నట్లుగా ఎన్పీడీసీఎల్ అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ లెక్కన మున్సిపల్ అధికారులు మరో 1,967 భవనాలకు ట్రేడ్ లైసెన్సులు జారీచేయాల్సి ఉంది. ఇంత పెద్ద మొత్తంలో తేడాలు రావడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వ్యాపార భవనాలకు ట్రేడ్ లైసెన్స్‌లు జారీ చేయడంలో కిందిస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
సర్వే నిర్వహిస్తే మరింత ఆదాయం..
మున్సిపాలిటీలో ట్రేడ్ లైసెన్స్‌ల జారీ విషయంలో గడిచిన పదేళ్ల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. పట్టణంలోని షాపులన్నింటికీ ట్రేడ్ లైసెన్స్‌లు ఇవ్వడం లేదని, అధికారులు ఉదాసీనంగా ఎందుకు వ్యవహరిస్తున్నారని గత పాలకవర్గాల సమయంలో పలువురు కౌన్సిలర్లు అనేకమార్లు ప్రశ్నించారు. అయినప్పటికీ ప్రస్తుతం కూడా అదే పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి ప్రత్యేక సర్వే నిర్వహిస్తే ట్రేడ్ లైసెన్స్‌ల సంఖ్య పెరిగి మున్సిపాలిటీకి మరింత ఆదాయం చేకూరే అవకాశం ఉంది.
వ్యాపార భవనాలన్నింటికీ లైసెన్స్‌లు జారీ చేశాం. డబ్బాలు, టేలకు ఎన్పీడీసీఎల్ అధికారులు 2వ కేటగిరి విద్యుత్ మీటర్లు ఇస్తారు. ఇంటి నంబర్లు లేనందున మున్సిపాలిటీ మాత్రం తాత్కాలిక ట్రేడ్ లైసెన్స్‌లు ఇస్తుంది. దీంతో రెండు శాఖల మధ్య వ్యత్యాసం ఏర్పడుతుంది. ఎన్పీడీసీఎల్ అధికారుల నుంచి డేటా తీసుకొని మరోమారు సర్వే నిర్వహించి వ్యాపార భవనాలన్నింటికీ ట్రేడ్ లైసెన్స్‌లు జారీ చేస్తాం.
– భాస్కర్, మున్సిపాలిటీ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్
కమర్షియల్ కేటగిరీలోని
విద్యుత్ మీటర్లు 3,394
వ్యాపార భవనాలకు సైతం
నాన్ రెసిడెన్షియల్ టాక్స్
ఫలితంగా మున్సిపాలిటీ
ఆదాయానికి గండి