
గిరిజనుల సమగ్రాభివృద్ధికి కృషి
భూపాలపల్లి రూరల్: గిరిజనుల సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. మంగళవారం భూపాలపల్లి మండలంలో గొల్ల బుద్ధారం నుంచి రాజునాయక్ కుంట, దూదేకులపల్లి నుంచి రేగడిగుట్ట వరకు రూ.4 కోట్ల 30 లక్షలతో నిర్మించనున్న బీటీ రహదారుల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం గొల్ల బుద్ధారం ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. మహిళలకు పెట్రోల్ బంకులు, సోలార్ ప్రాజెక్టులు చేపట్టినట్లు వివరించారు. గిరిజన, ఎస్సీ, మైనారిటీ సంక్షేమ శాఖలలో పనిచేస్తున్న సిబ్బందికి పెండింగ్ వేతనాలు రెండు రోజుల్లో జమచేస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్ధికి శాసనసభ్యులు కోరిన విధంగా నిధులు మంజూరు చేస్తానని తెలిపారు. ఆపరేషన్ సింధూర్‌తో ఇతర దేశాల నుంచి యూరియా రాక కొరత ఏర్పడిందని చెప్పారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ.. మేడారం వెళ్లేందుకు కమలాపూర్ క్రాస్ నుంచి రహదారి అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు, ప్రభుత్వ ఆస్పత్రులలో వైద్యసేవలు మెరుగుపరిచేందుకు సిటీ స్కానింగ్, వైద్య, సిబ్బంది పోస్టుల భర్తీ చర్యలు చేపట్టామని తెలిపారు. పాఠశాలలకు అదనపు తరగతి గదులు, మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ పాఠశాలల్లో మౌలిక సౌకర్యాల కల్పనకు మరమ్మతులు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా సంక్షేమ అధికారి మల్లీ శ్వరి, అదనపు ఎస్పీ నరేష్‌కుమార్, పార్టీ మండల అధ్యక్షుడు ఆర్టీఏమెంబర్ రాంచంద్రయ్య పాల్గొన్నారు.
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్