
యూరియా కోసం బారులు
చిట్యాల: మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు సోమవారం ఉదయమే క్యూలైన్‌లో బారులుదీరారు. ఓడీఎంఎస్, అగ్రోస్, షాపులలో 555 యూరియా బస్తాలను పోలీసు బందోబస్తు నడుమ రైతులకు పంపిణీ చేశారు. కొంతమంది రైతులకు యూరియా బస్తాలు దొరక్కపోవడంతో అనేక ఇబ్బందులు పడుతూ వెనుదిరిగిపోయారు. అధికారులు చొరవ తీసుకుని యూరియా అందించాలని అంటున్నారు.
మల్హర్: మండలంలోని తాడిచర్ల సహకార సొసైటీ, కొయ్యూరు, అన్సాన్‌పల్లి గ్రామాల్లో సోమవారం యారియా కోసం రైతులు బారులుదీరారు. మండలంలోని తాడిచర్ల సొసైటీకి ఆదివారం రాత్రి 40 టన్నులు, కొయ్యూరుకు 10 టన్నులు, అన్సాన్‌పల్లికి 15 టన్నుల యూరియా వచ్చింది. దీంతో సోమవారం సొసైటీ వద్దకు, కొయ్యూరు, అన్సాన్‌పల్లిలో గ్రామాల్లో రైతులు యూరియా కోసం భారీగా తరలివచ్చారు. కొయ్యూరు పోలీసులు పంపిణీ కేంద్రాల వద్దకు చేరుకున్నారు. రిజిస్టర్‌లో పేర్లు నమోదు చేసుకున్న రైతుల పేర్ల ఆధారంగా వారికి టోకెన్లు అందించారు. తాడిచర్ల సొసైటీ వద్ద ఒక్క రైతుకు రెండు బస్తాలు, కొయ్యూరు, అన్సాన్‌పల్లిలో రైతుకు ఒక్క యూరియా బస్తాను అందించారు. మరో రెండు, మూడు రోజుల్లో మళ్లీ లోడ్ వస్తుందని రైతులు ఆందోళన చెందవద్దని అధికారులు సూచించారు.

యూరియా కోసం బారులు