
భూ సేకరణ పూర్తి చేస్తాం
● కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి: జాతీయ రహదారుల నిర్మాణం కోసం అవసరమైన భూ సేకరణ త్వరలోనే పూర్తి చేస్తామని కలెక్టర్ రాహుల్ శర్మ వెల్లడించారు. సోమవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం నుంచి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు, ఆర్‌అండ్‌బీ అధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ నుంచి పాల్గొన్న కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. జాతీయ రహదారి నిర్మాణం కోసం మొత్తం 130 హెక్టార్లలో భూమి అవసరం ఉందని, దానిలో 117.97 సేకరణ పూర్తయిందని తెలిపారు. పెండింగ్‌లో 12.3 హెక్టార్ల భూ సమస్య ఉందని, ఇందులో 7.79 హెక్టార్ల భూమి కోర్టు కేసుల్లో ఉందని వెల్లడించారు. మిగిలిన 6.02 హెక్టార్ల భూమికి టైటిల్ సమస్యలు ఉన్నందున, నిధులు డిపాజిట్ చేసి భూ సేకరణ పూర్తి చేస్తామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, ఆర్‌అండ్‌బీ డీఈ కిరణ్‌కుమార్ పాల్గొన్నారు.
పరిష్కారానికి చర్యలు..
ప్రజలు ప్రజావాణిలో ఇచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో కలిసి ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 42 మంది నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.